భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా..

4 Oct, 2023 15:05 IST|Sakshi

ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో పెరిగిన ఆర్ధిక వ్యయానికి సంబంధించి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ రాష్ట్రంలో అప్పు రూ.50,000 కోట్లు పెరిగిపోవడంపై వివరణ కోరగా ముఖ్యమంత్రి భగవంత్ మన్ గత ప్రభుత్వం చేసిన రుణాలకు చెల్లించిన వడ్డీలతోపాటు ఇటీవలి కాలంలో పెరిగిన జీఎస్టీ, వాహన పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ చార్జీల వల్లనే వ్యయం పెరిగిందని లేఖ ద్వారా తెలిపారు. 

ముఖ్యమంత్రి భగవంత్ మన్ రాసిన లేఖలో.. గడిచిన ఏడాదిలో  పంజాబ్ ఎక్సయిజ్ పన్ను ఏకంగా 37 శాతం పెరిగిందని అలాగే వస్తు సేవల పన్ను 16.6 శాతం, వాహనాలపై మన్ను వసూళ్లు 13 శాతం స్టాంపు రిజిస్ట్రేషన్ల వసూళ్లు 28 శాతం పెరిగాయని వెల్లడించారు. ఏప్రిల్ 1, 2002 నుండి ఆగస్టు 31,2023 వరకు పంజాబ్ రాష్ట్రం అప్పు రూ.47,107 కోట్లు పెరిగిందని అందులో రూ.27,016 కోట్లు అంతకుముందు తీసుకున్న అప్పుకు వడ్డీగా చెల్లించామని తెలిపారు.

నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వాలు వదిలిపెట్టిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశామని వారు విస్మరించిన సంస్థల పునరుద్ధరణకు అలాగే వారు అమలు పరచిన కొన్ని పథకాలను కొనసాగించడానికి అప్పులను అలాగే సొంత ఆర్ధిక వనరులను కూడా వినియోగించామని లేఖలో నివేదించారు. ఇక రాష్ట్రంలో మూలధన వనరులను ఏర్పరిచి అభివృద్ధి పనుల కోసం కొత్తగా చేసిన అప్పులను వినియోగించినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

మరిన్ని వార్తలు