అతనికెంత ధైర్యం.. ఆమె దుస్తులపై చెయ్యి వేస్తాడా?

5 Oct, 2020 13:55 IST|Sakshi

ముంబై: ‘మహిళా నాయకురాలి దుస్తుల మీద చేయి వేస్తాడా! ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను బలంగా విశ్వసించే యోగి ఆదిత్యనాథ్‌ జీ సదరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా వాగ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉత్తరప్రదేశ్‌ పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ మేరకు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. (చదవండి: ప్రియాంకపై కాంగ్రెస్‌ ప్రశంసలు)

ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు చిత్రపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజేపీలో చేరినప్పటికీ ఆమె తన సంస్కారం మరచిపోలేదని, సాటి మహిళకు మద్దతుగా నిలిచారంటూ మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సత్యజిత్‌ తాంబే ప్రశంసించారు. కాగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన హథ్రాస్‌ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ యూపీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ- ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. యోగి సర్కారు తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రతిపక్ష నేతలు రోడ్ల మీదకు రావడంతో భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో ఓ అధికారి ప్రియాంక గాంధీ దుస్తులు పట్టుకుని ఆమెను ఆపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు