Bomb Threat: ఢిల్లీ స్కూల్‌, పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

12 Apr, 2023 16:22 IST|Sakshi

ఈ మధ్యకాలంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపు ఫోన్ల ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్నటికి మొన్న సల్మాన్‌ ఖాన్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, శివసేన నేత సంజయ్‌ రౌత్‌ను చంపేస్తామని బెదిరింపులు అందాయి. దీంతోపాటు వివిధ చోట్ల బాంబు పెట్టి పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. తాజాగా ఓ పాఠశాలతోపాటు విమనాశ్రాయానికి బెదిరింపులు వచ్చాయి. 

ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్‌ నగర్‌లోని ది ఇండియన్‌ స్కూల్‌ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్‌ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. తరువాత బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. పాఠశాల లోపల, పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి నుంచి జయప్రకాశ్‌ నారాయణ్‌ విమానాశ్రయానికి బెదిరింపు కాల్‌ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు బాంబ్‌ స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు లోపల, బయట సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 1.47 గంటలకు ఈ బెదిరింపు అధికారులకు అందింది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తుండటంతో విమానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు