ఫొటోగ్రాఫర్‌ రాలేదా? గిట్లయితే ఎట్ల! నమ్మకం పోయింది.. పెళ్లి బంద్‌!

4 Jun, 2022 13:19 IST|Sakshi

ఈ మధ్య పెళ్లిళ్లన్నీ పీటల మీద ఆగిపోతున్నాయి. బట్టతల ఉందని ఒకరు, తాగుతున్నాడని మరొకరు అబ్బాయిలను తిరస్కరిస్తే, ఈ అమ్మాయి మాత్రం... పెళ్లికి అబ్బాయి వాళ్లు ఫొటోగ్రాఫర్‌ను పెట్టలేదని పీటల మీదనుంచి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ దేహత్‌ జిల్లాలోని ఓ అమ్మాయికి అదే జిల్లాకు చెందిన భోగ్నిపూర్‌కు చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు పూర్తయిపోయాయి. పెళ్లి వేడుక మొదలైంది.

అబ్బాయి బరాత్‌తో వేడుకగా వచ్చాడు. వేదిక కూడా ఎక్కాడు. ఇక పూల మాల వేయడమే తరువాయి. ఆ క్షణాలను పట్టి బంధించడానికి ఫొటోగ్రాఫర్‌ లేడన్న విషయాన్ని వధువు గుర్తించింది. వెంటనే వేదిక దిగి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరు ఎంత చెప్పినా ససేమిరా అంది. ‘పెళ్లి వేడుకనే సరిగ్గా పట్టించుకోనివాడు... రేపు పెళ్లయ్యాక తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకమేంటి’ అంటూ తిరస్కరించింది.

ఇక చేసేదేం లేక అప్పటిదాకా ఇచ్చిపుచ్చుకున్న డబ్బు, నగలు, వస్తువులు ఎవరివి వాళ్లకు ఇచ్చేసి... రెండు కుటుంబాలు వెనుదిరిగాయి. తరువాత తేలిందేమంటే అబ్బాయివాళ్లు ముందే మాట్లాడి పెట్టినా... ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌ మధ్య పొసగక ఇద్దరూ రాలేదు.
చదవండి👉🏼మూడొంతుల మందికి మంచి తిండి కలే

మరిన్ని వార్తలు