హత్రాస్‌ ఘటన: ‘కారు ఎప్పుడైనా బోల్తా పడవచ్చు’

30 Sep, 2020 20:28 IST|Sakshi

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయవచ్చనే హింట్‌

లక్నో: ఈ మధ్య కాలంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చట్టాలు ఎంత కఠినంగా మారితే.. మృగాళ్లు అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాము పాల్పడిన నేరానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. దాంతో ఇలాంటి ఘటన పట్ల ప్రజల ఆలోచన తీరులో కూడా మార్పు వస్తోంది. తక్షణ న్యాయం అనే డిమాండ్‌ పెరుగుతుంది. తెలంగాణలో దిశ సమయంలో పోలీసులు అవలంభించిన తీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్‌కౌంటరే మృగాళ్లకు సరైన శిక్ష అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ ఘటనలో కూడా ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సదరు లీడర్‌ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరగొచ‍్చనే హింట్‌ ఇచ్చారు. (చదవండి: అమ్మను బాధపడవద్దని చెప్పండి..)

వివరాలు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా బుధవారం హత్రాస్‌ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితులను అరెస్ట్‌ చేశారు. కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు అప్పగించారు. వారిని అరెస్ట్‌ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్‌ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రంలో ఒక కారు ఎప్పుడైనా బోల్తా పడగలదని నాకు తెలుసు’ అంటూ ఎన్‌కౌంటర్‌ జరిగే అవకాశం ఉందనే హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. (చదవండి: యూపీలో అత్యాచారాల పరంపర)

ఇక ఈ ఘటనపై ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. యూపీలో గుండా రాజ్యం నడుస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇక కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ హత్రాస్‌ ఘటనకు బాధ్యత వహిస్తూ.. యోగి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా