దవడ పగలకొట్టిన కలెక్టర్‌: ఆపై ట్విస్ట్‌..

23 May, 2021 09:00 IST|Sakshi

రాయ్‌పూర్‌: లాక్‌డౌన్‌ రూల్స్‌ పేరుతో ఓ వ్యక్తితో దురుసుగా ప్రవర్తించిన ఛత్తీస్‌ఘడ్‌ కలెక్టర్‌ వ్యవహారం ట్విట్టర్‌ను కుదిపేస్తోంది. మందులు కొనడానికి వెళ్లిన ఆ వ్యక్తిపై కలెక్టర్‌ చెయ్యి చేసుకోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

సూరజ్‌పూర్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మందులు కొనడానికి వెళ్తున్న ఆ వ్యక్తిని లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న కలెక్టర్ రణ్‌బీర్‌ శర్మ‌, పోలీస్‌ అధికారులు అడ్డగించారు. ఆ వ్యక్తి మందులకు సంబంధించిన చీటీలు చూపిస్తున్న టైంలో కలెక్టర్‌ మొబైల్‌ ఇవ్వమని కోరాడు. సెల్‌ఫోన్‌ను నేలకోసి కొట్టి ఆ వ్యక్తి చెంపచెల్లుమనిపించాడు. అంతేకాదు అక్కడున్న పోలీసులకు అతన్ని చితకబాదమని ఆదేశాలివ్వడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు చెరోవైపు అతనిపై లాఠీ దెబ్బలు ఝుళిపించారు. ఆపై ఆ వ్యక్తిని బూతులు తిడుతూ కలెక్టర్.. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు‌.  

వైరల్‌.. చర్యలకు డిమాండ్‌
వాట్సాప్‌,ఫేస్‌బుక్‌లో ఈ వీడియో నిన్నంతా సర్క్యూలేట్‌ అయ్యింది. పైగా ఆ వీడియోలో ఉంది మైనర్‌ అని ప్రచారం కావడంతో కలెక్టర్‌పై వేటు వేయాలని కొందరు డిమాండ్‌ చేశారు. రణ్‌బీర్‌ శర్మ తీరు గుండాలా ఉందంటూ తప్పుబడుతున్నారు. ట్విట్టర్‌లో #SuspendRanbirSharmaIAS హ్యాష్‌ట్యాగ్‌తో కొందరు పోస్టులు పెడుతున్నారు. గతంలో త్రిపుర పశ్చిమ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్) శైలేష్ కుమార్‌ యాదవ్‌.. ఓ పెళ్లిని మధ్యలో ఆపేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో చర్యలు తీసుకున్న విషయాన్ని కొందరు ప్రస్తావించారు కూడా. 


ట్విస్ట్‌.. కేసు
అయితే ఈ ఘటనలో ఆవ్యక్తిపైనే కేసు నమోదు కావడం విశేషం. ఆ వ్యక్తి మైనర్‌ కాదని, ఆపమన్నా వినకుండా వేగంగా వెళ్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు కలెక్టర్‌ రణ్‌బీర్‌ శర్మ కూడా ఘటనపై స్పందించాడు. క్షమాపణలు చెబుతూ.. కావాలని చేయలేదని వెల్లడించాడు. తన కుటుంబం కూడా కొవిడ్‌ బారినపడినా తాను డ్యూటీ చేస్తున్నానని, తప్పుడు పేపర్లతో ఆ వ్యక్తి బయట తిరుగుతున్నాడని, ఇలాంటి టైంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజల్ని కలెక్టర్‌ రిక్వెస్ట్‌ చేశాడు. కానీ, బాధితుడు మాత్రం మెడికల్‌ షాప్‌కి వెళ్తున్నా.. అని చెప్తున్నా వినకుండా ‘ఎక్కడికి రా?’ అంటూ కలెక్టర్‌ తనతో దురుసుగా వ్యవహరించాడని వాపోయాడు.

వేటుకి సీఎం ఆదేశం
సూరజ్‌పూర్‌ కలెక్టర్‌ దురుసు ప్రవర్తనపై దుమారం చెలరేగిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘెల్‌ స్పందించారు. కలెక్టర్‌ రణ్‌బీర్‌ శర్మపై వేటు వేస్తున్నట్లు ఆదివారం సీఎం కార్యాలయం ప్రకటించింది. లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘించాడని ఆ వ్యక్తిపై కలెక్టర్‌ చెయ్యి చేసుకున్న వీడియో వైరల్‌ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు