India-China: సరిహద్దుల్లోకి చైనా రోబోట్లు

1 Jan, 2022 04:22 IST|Sakshi

న్యూఢిల్లీ: డ్రాగన్‌ దేశం చైనా సరిహద్దుల్లో మరో కుయుక్తికి తెరలేపింది. అతి శీతల, ఎత్తైన పర్వత ప్రాంతంలో భారత సైన్యంతో ధీటుగా తలపడలేని పీఎల్‌ఏ (చైనా సైన్యం) మెషిన్‌ గన్లను బిగించిన రోబోట్లను రంగంలోకి దించింది. ఆయుధాలను, ఇతర సరఫరాలను చేరవేయగలిగే మానవరహిత వాహనాలను అత్యధిక భాగం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోనే ఉంచినట్లు్ల సమాచారం. షార్ప్‌ క్లా అనే పేరున్న రోబోట్‌కు తేలికపాటి మెషిన్‌గన్‌ బిగించి ఉంటుంది. దీనిని రిమోట్‌తో ఆపరేట్‌ చేయవచ్చు.

మ్యూల్‌–200 అనే మరో రోబో కూడా మనుషులతో అవసరం లేకుండానే ఆయుధాలను ఉపయోగించగలదు. టిబెట్‌ ప్రాంతంలో మోహరించిన మొత్తం 88 ‘షార్ప్‌ క్లా’రోబోల్లో 38, మ్యూల్‌ రకానికి చెందిన 120 రోబోల్లో అత్యధికం తూర్పులద్దాఖ్‌ ప్రాంతంలోనే చైనా మోహరిం చినట్లు సమాచారం. వీటికితోడుగా, సాయుధ బలగాలను తరలించే వీపీ–22 రకానికి చెందిన మొత్తం 70 వాహనాలకు గాను 47 వాహనాలను సరిహద్దుల్లోకి తీసుకువచ్చినట్లు మీడియా పేర్కొంది. అంతేకాకుండా, అన్ని రకాల ప్రాంతాల్లో మోర్టార్లు, శతఘ్నులు, హెవీ మెషిన్‌గన్ల వంటివాటిని తరలించేందుకు లింక్స్‌ రకం వాహనాలను కూడా సైన్యానికి తోడుగా సరిహద్దుల్లోనే చైనా ఉంచిందని సమాచారం. 

మరిన్ని వార్తలు