బిహార్‌లో బహిరంగంగా మద్యం సరఫరా...నితీష్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరాగ్‌ పాశ్వాన్‌

13 Sep, 2022 15:11 IST|Sakshi

బిహార్‌: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో రాజకీయ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నుంచి ఎడతెగనిదాడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరాగ్‌ పాశ్వాన్‌ , ప్రశాంత్‌ కిషోర్‌, ఆర్‌సీపీ సింగ్‌ వంటి నేతలు నితీష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్‌లో నేరాలు పెరిపోతున్నాయంటూ లోక్‌ జనశక్తి పార్టీ(రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఇటీవలే నితీష్‌ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై పలు విమర్శలు చేస్తూ...ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరాగ్‌ పాశ్వాన్‌ బిహార్‌లో మద్యం పూర్తిగా నిషేధింపబడిందంటూ... నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బల్లియా నుంచి దరౌలికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానంటూ బైక్ నడుపుతూ వెళ్లుతుంటాడు.

అయినా సీఎం దృష్టి ప్రధాని కుర్చిపైనే ఉంది, ఆయన దయచేసి ఇక్కడ దృష్టి సారించి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఆరోపణలు కూడా చేశాడు. ఆ వీడియోలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహంచినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి బిహార్‌లో 2016 నుంచి మద్యాన్ని నిషేధించడమే కాకుండా అతిక్రమించింన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే పెద్ద సంఖ్యలో నేరస్తులు జైళ్లల్లో శిక్ష అనుభవించడం ఎక్కువవ్వడం...మరోవైపు కేసుల సంఖ్య పెండింగ్‌లో ఉండటం తదితర కారణాల రీత్యా నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది. మొదటిసారి నేరానికి పాల్పడితే మేజిస్ట్రేట్‌ సమక్షంలో సుమారు రూ. 2000 నుంచి 5000 వరకు జరిమాన చెల్లిస్తే వదిలేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు పెద్ద ఎత్తున నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పై విరచుకుపడుతున్నాయి. 

(చదవండి: నా శాఖలో అందరూ దొంగలే... బిహార్‌ మంత్రి వ్యాఖ్యలు వైరల్‌)

మరిన్ని వార్తలు