బీహార్‌ సీఎం నితీష్‌కు బిగ్‌ షాక్‌.. దాడి చేసిన 13 మంది అరెస్ట్‌.. వీడియో వైరల్‌

22 Aug, 2022 09:46 IST|Sakshi

Bihar CM Nitish Kumar..  బీహార్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌కు తృటిలో చేదు అనుభవం తప్పింది. సీఎం కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌ మారింది. ఈ ఘటనలో పోలీసులు 13 మందిని అరెస్ట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. బీహార్‌లో ఇటీవలే మహాఘట్‌ బంధన్‌ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా, సీఎం నితీష్‌ కుమార్‌ సోమవారం గయా పట్టణంలో​ పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా నితీష్‌ కుమార్‌.. గయాకు హెలీకాప్టర్‌లో వెళ్లగా.. లోకల్‌గా తిరిగేందుకు ఆయన కాన్వాయ్‌ అక్కడికి బయలుదేరింది. ఈ నేపథ్యంలో పట్నా-గయా హైవేపై సంచలన ఘటన చోటుచేసుకుంది. 

అక్కడ.. కొందరు వ్యక్తులు నిరసనలు తెలుపుతున్నారు. గౌరీచక్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దిరోజులుగా తప్పిపోవడం ఆ తర్వాత శవమై కనిపించడంతో కలకలం మొదలైంది. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని నిరససిస్తూ వారు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం కాన్వాయ్‌ అటుగా రావడంతో నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, వారి దాడి సందర్భంగా సీఎం కారులో లేకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

కాన్వాయ్‌పై దాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు. తాజాగా ఈ ఘటనతో సంబంధం ఉన్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇక, సీఎం కాన్వాయ్‌పై దాడి ఘటన బీజేపీ అనుకూలంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు స్పందిస్తూ.. బీహార్‌లో మళ్లీ అక్రమార్కుల రోజులు వచ్చాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్‌

మరిన్ని వార్తలు