Karnataka: మహిళలపై కాంగ్రెస్‌ వరాల జల్లు..సెపరేట్‌గా మేనిఫెస్టో!

16 Jan, 2023 18:13 IST|Sakshi

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ మహిళలపై వరాలజల్లు కురిపించింది. ఏకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో పెడతానంటూ పలు హామీలు ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక వాద్రా ఒక కార్యక్రమంలో తాము గనుక అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ. 2000 ఇస్తామని ప్రకటించారు. గృహలక్ష్మీ యోజన కింద ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఉపకరించే బేసిక్‌ ఆదాయం కింద ఏడాదికి రూ. 24,000 నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ని అందిస్తామని హామి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

అంతేగాదు ఈ గృహలక్ష్మీ యోజన అనేది కాంగ్రెస్‌ పార్టీ అధికమైన ఎల్‌పీజీ గ్యాస్‌ ధరల తోపాటు తమ రోజు వారీ ఖర్చుల నిమిత్తం మహిళలకు ఉపకరించేలా చేసిన ప్రయత్నమని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ప్రతి మహిళ సాధికారిత తోపాటు తన కాళ్లపై తాను నిలబడి తన పిల్లలను చూసుకునే సామర్థ్యాంతో ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటుంది. అందుకనే ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారని పార్టీ తెలిపింది. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తామని చెప్పింది.

ఈ మేరకు ప్రియాంక గాంధీ " నేను నాయకురాలిని(నా నాయకి) " అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ... కర్ణాటకలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందంటూ విమర్శించారు. పైగా మంత్రులు ఉద్యోగాల్లో సుమారు 40% కమిషన్‌ తీసుకుంటున్నారని అన్నారు. అంతేగాదు కర్ణాటకలో సుమారు రూ. 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు.

అలాగే పోలీస్‌ సబ్‌ఇ​న్‌స్పెక్టర్‌ స్కామ్‌ గురించి మాట్లాడుతూ..కర్ణాటకలో లంచాలు ఇవ్వకుండా ఏది జరగదన్నారు. పోలీసుల పోస్టులనే అమ్ముకునే సిగ్గుమాలిన మోసాలు జరుగుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. అయినా మీరు అధికారుల నుంచి ఆశించేది ఇదేనా? అని ప్రజలను ప్రశ్నించారు. ముందుగా పిల్లలను, బాలికలను ఉద్యోగాలు వచ్చేలా చదివించండి అని చెప్పారు. అలాగే బెంగుళూరులో జరగాల్సిన సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులు గురించి ఆలోచించండి అని ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

(చదవండి: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 9 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌!)

మరిన్ని వార్తలు