సర్కారీ దవాఖానాలో దారుణం: పేషెంట్లకు ఒకే సిరంజీ.. హెచ్‌ఐవీ సోకడంతో చిన్నారిని బయటకు నెట్టేశారు!

5 Mar, 2023 12:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఓ డాక్టర్‌ పేషెంట్లందరికీ ఒకే సిరంజీతో సూది మందులు ఇవ్వగా.. ఓ బాలికకు హెచ్‌ఐవీ సోకింది. అయితే బాలికకు హెచ్‌ఐవీ నిర్ధారణ అయ్యాక సిబ్బంది ఆమెను బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. 

బాధిత తల్లిదండ్రుల కథనం ప్రకారం.. యూపీ ఎటాహ్ జిల్లా రాణి అవంతి బాయి లోధా గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్‌ అప్పటికే కొందరు షేషంట్లకు వాడిన సిరంజీతో ఇంజెక్షన్‌ చేశాడు. ఆ సమయంలో పేరెంట్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సిబ్బంది పట్టించుకోకుండా ఇంజెక్షన్‌ వేశాడు. ఆ తర్వాత అదే సిరంజీని మరికొందరికి వాడాడు కూడా.

ఆపై కొన్నిరోజులకు చిన్నారికి రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీగా తేలింది. దీంతో రాత్రికి రాత్రే  ఆస్పత్రి సిబ్బంది  ఆ బాలికను బయటకు బలవంతంగా పంపించేశారు. ఈ ఘటనపై శనివారం ఆమె తల్లిదండ్రులు జిల్లా న్యాయాధికారి(కలెక్టర్‌) అంకిత్‌ కుమార్‌ అగర్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు విషయం వార్తల్లోకి ఎక్కడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పాథక్‌ స్పందిస్తూ.. ఘటనపై సమగ్ర వివరణ కోరామని, డాక్టర్‌ది తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాల బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు