విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త

3 Dec, 2020 18:30 IST|Sakshi

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ ఇటీవల కేంద్రం అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లమెల్లగా పుంజుకుంటుంన్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా సైతం మళ్లీ పరుగులు పెడుతోంది. దాదాపు రెండు నెలలు తర్వాత మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండగా రానురానూ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో విమానాల రాకపోకలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విమాన ప్రయాణికులకు కేంద్రం శుభ వార్త అందించింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్‌ ఫ్లైట్స్‌: విస్తారా కన్ను

మే నుంచి నేటి వరకు భారత విమానయాన సంస్థ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం నడిపిస్తుండగా. ఇప్పుడు ఆ సంఖ్యను ఈ రోజు(డిసెంబర్‌3) నుంచి 80 శాతానికి పెంచినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. ‘30 వేల ప్రయాణికులతో మే 25న దేశీయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.. నవంబర్ 30వ తేదీ నాటికి ఆ సంఖ్య 2.52 లక్షల గరిష్టాన్ని తాకింది. ఇప్పుడు.. దేశీయంగా ప్రస్తుతం ఉన్న విమానాలు 70 శాతం నుంచి 80 శాతం వరకు నడుపుకోవచ్చు’. అని ట్వీట్ చేశారు. కాగా కరోనా వైరస్ పరిస్థితుల్లోని డిమాండ్‌ కారణంగా భారత విమానయాన సంస్థలు తమ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70  శాతం వరకు నడపవచ్చని నవంబర్ 11న మంత్రి తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచడంతో మరిన్ని విమానయాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు