భర్తతో అభిప్రాయ భేదాలు.. బట్టలు ఆరేస్తుండగా..

9 Aug, 2021 21:10 IST|Sakshi
మృతి చెందిన వారు

సాక్షి, చెన్నై(తమిళనాడు): కృష్ణగిరిలో ఆదివారం ఇంటి డాబా మీద బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగత జీవులయ్యారు. కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై శింగారపేట అంబేడ్కర్‌ నగర్‌కు చెంది న పిచ్చుమణి, ఇందిరా దంపతులకు మహాలక్ష్మి(25) కుమార్తె. భర్త శివతో అభిప్రాయ భేదాల కారణంగా కుమార్తె అవంతిక(03)తో కలిసి తల్లిదండ్రుల ఇంట్లో మహాలక్ష్మి ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం మనవరాలిని చంకలో వేసుకుని డాబా మీద బట్టలు ఆరవేయడానికి ఇందిరా వెళ్లింది.

ఈ సమయంలో తడిసిన బట్టలు ఇంటికి సమీపంలోని విద్యుత్‌ తీగల మీద పడ్డాయి. దీంతో వారిద్దరూ కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. గుర్తించిన మహాలక్ష్మి తన బిడ్డ, తల్లిని రక్షించే క్రమంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించారు. ఇంటి డాబా మీద ఇందిరా, మహాలక్ష్మి, అవంతిక పడి ఉండడాన్ని పక్కింటి వారు గుర్తించి విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్‌ సరఫరాను ఆ పరిసరాల్లో నిలిపి వేశారు. సింగారపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

పుదుకోట్టైలో.. 
పుదుకోట్టై జిల్లా ఆలంకుడి మరమాడి గ్రామానికి చెందిన మది అళగన్‌ భార్య తమిళ్‌ సెల్వి ఉదయాన్నే తమ పంట పొలం వైపుగా వెళ్లింది. అయితే, అక్కడ విద్యుత్‌ తీగలు తెగి పడి ఉండడాన్ని ఆమె గుర్తించ లేదు. విద్యుదాఘాతానికి గురై ఆమె మరణించింది.  

మరిన్ని వార్తలు