Atiq Ahmed: కుమారుడి సమాధి పక్కనే అతీక్ ఖననం.. పటిష్ఠ భద్రత నడుమ అంతిమయాత్ర

17 Apr, 2023 11:57 IST|Sakshi

లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని కసారి మసారి శ్మశాన వాటికలో ఇద్దరిని ఖననం చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ, అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసు, ఆర్‌ఎఎప్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయితే ఇదే శ్మశాన వాటికలో అతీక్ కుమారుడు అసద్‌ను కూడా ఖననం చేశారు. ఆ సమాధి పక్కనే తండ్రిని ఖననం చేశారు. అతీక్ తల్లిదండ్రులను సమాధులు కూడా ఇదే శ్మశానవాటికలో ఉన్నాయి.

శనివారం రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన అతీక్, అతని సోదరుడు అష్రఫ్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా, పోలీసుల ఎదుటే ముగ్గురు యువకులు వీరిపై తుపాకులతో దాడి చేసి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి చంపారు. అనంతరం ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు.   ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా.. పేరు ప్రఖ్యాతుల కోసమే తాము అతీక్‌, అతని సోదరుడ్ని అందరిముందే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. వీరు ఏం పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసయల్యారని కుటుంబసభ్యులు తెలిపారు.
చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..

మరిన్ని వార్తలు