గోరఖ్‌నాథ్‌ ఆలయంపై దాడి కేసు.. నిందితుడు ముర్తజాకు మరణశిక్ష

30 Jan, 2023 20:49 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయంలోకి చొరబడి కత్తితో భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన అహ్మద్‌ ముర్తజా అబ్బాసీని దోషిగా తేల్చిన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు.. అతనికి మరణశిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్‌ 121 ప్రకారం నిందితుడికి మరణశిక్ష విధించినట్లు ఏడీజీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. పోలీస్‌ సిబ్బందిపై దాడి చేసినందుకు సెక్షన్‌ 307 ప్రకారం జీవిత ఖైదు కూడా విధించినట్లు పేర్కొన్నారు.

కాగా దాదాపు తొమ్మిది నెలల క్రితం గతేడాది ఏప్రిల్‌లో గోరఖ్‌పూర్‌ జిల్లాలోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికే చెందిన ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి.. ఆలయం వద్ద కత్తితో వీరంగం సృష్టించి.. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అక్కడే సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకోబోగా పదునైన కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో నిందితుడితోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు అరెస్టు చేశారు. 

అయితే ఉగ్ర కుట్రలో భాగంగానే నిందితుడు ఆలయంలోకి ప్రవేశించి భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో తనకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌)తో సంబంధాలున్నట్లు నిందితుడు అంగీకరించాడు. ఐసీసీ్‌ కోసం పోరాడుతున్నట్లు, ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అబ్బాసీని ఎన్‌ఐఏకోర్టు దోషిగా తేల్చింది. తాజాగా అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గోరఖ్‌పూర్‌ సివిల్‌ లైన్స్‌ ప్రాంతానికి చెందిన అబ్బాసీ.. 2015లో ఐఐటీ ముంబయి నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. అయితే 2017 నుంచి అబ్బాసీ  మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
చదవండి: ఫుట్‌పాత్‌పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు