Lakhimpur Kheri Violence: లఖీమ్‌పూర్‌ ఘటన: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

7 Oct, 2021 11:17 IST|Sakshi

లక్నో: లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనతో చెలరేగిన రాజకీయ వివాదం ఉత్తర ప్రదేశ్‌ను హీటెక్కిస్తోంది. కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌, ప్రియాంక గాంధీ మరణించిన రైతుల కుంటుంబాలను బుధవారం కలుసుకొని ‘పరిహారం ఇవ్వడం కాదు న్యాయం జరగాలి’ అని డిమాండ్‌ చేశారు. తాజాగా ప్రతిపక్షాల ఒత్తిడి మధ్య ఉత్తరప్రదేశ్‌​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లఖీమ్‌పూర్‌ ఘటనను విచారించడానికి రిటైర్డ్‌ జడ్జీ ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: హైడ్రామా నడుమ రాహుల్‌ పరామర్శ

దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరొ కొన్ని నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో లఖీమ్‌పూర్‌ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లఖీమ్‌పూర్‌ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. 

కాగా అక్టోబర్‌ 3న లఖీమ్‌పూర్‌ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజ‌య్ మిశ్రాకు చెందిన కాన్వాయ్‌.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లఖీమ్‌పూర్ హింసను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

అలాగే సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా అందులో లేడని చెప్పారు.

మరిన్ని వార్తలు