సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు రేపే

28 Nov, 2021 05:21 IST|Sakshi
సింఘూ సరిహద్దు వద్ద మీడియా సమావేశంలో దర్శన్‌ పాల్‌, ఇతర రైతు నేతలు

లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర వ్యవసాయ మంత్రి 

తమ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దిగువ సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో ఈ కొత్త బిల్లును అధికారులు చేర్చారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది.

‘‘మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొందరు రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’ అని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న లోక్‌సభకు కచ్చితంగా హాజరు కావాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత మాత్రాన సరిపోదని, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి.

ట్రాక్టర్ల ర్యాలీ రద్దు
ఈ నెల 29వ తేదీన పార్లమెంట్‌ వరకూ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నేత దర్శన్‌ పాల్‌ శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. డిసెంబర్‌ 4న రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో ఆదివారం సంయుక్త షెట్కారీ కామ్‌గార్‌ మోర్చా(ఎస్‌ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో కిసాన్‌–మజ్దూర్‌ మహాపంచాయత్‌ నిర్వహించనున్నారు. 100కు పైగా రైతు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి.

రైతుల త్యాగాలను కించపరుస్తారా?: కాంగ్రెస్‌
వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ‘అభ్యంతరాలు, కారణాలు’ అనే పదాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా కొనసాగుతున్న పోరాటంలో మరణించిన 750 మంది రైతుల త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 750 మంది రైతులు మరణిస్తే, కేవలం కొందరే ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం ఏమిటని నిలదీశారు.  

పంట వ్యర్థాల దహనం నేరం కాదు
కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి: కేంద్రం
రైతాంగం డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని నేరంగా పరిగణించరాదంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆందోళన విరమించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటల వైవిధ్యంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రధాని మోదీ హామీ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉందని అన్నారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిండంపైనా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతా రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రైతన్నలు పెద్ద మనసు చేసుకొని, పోరాటం ఆపేసి, ఇళ్లకు తిరిగి వెళ్లాలని తోమర్‌ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల దక్కే ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒప్పించలేకపోయామని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు.  

మరిన్ని వార్తలు