రాహుల్‌ పర్యటన వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌.. కీలక నేత రాజీనామా

4 Sep, 2022 17:43 IST|Sakshi

రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ పార్టీకి రాజీనామా చేస్తూ రాహుల్‌ గాంధీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హస్తం పార్టీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. 

వివరాల ప్రకారం.. గుజరాత్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం అధిష్టానానికి లేఖ రాశారు. ఆ లేఖలో తాను కాంగ్రెస్‌ పార్టీకి వీడ్కోలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే విశ్వనాథ్‌సింగ్ వాఘేలా ఏ పార్టీలో చేరుతారో అన్నది ఇంకా మాత్రం చెప్పలేదు. మరోవైపు.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. సోమవారం(సెప్టెంబర్‌ 5న) గుజరాత్‌లో పర్యటించనున్నారు.  ఈ క్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ వాఘేలా పార్టీని వీడటం పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్‌ పాల్గొంటారు. అలాగే సెప్టెంబర్ 5న అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో బూత్ స్థాయి కార్యకర్తల ‘పరివర్తన్ సంకల్ప్’ సదస్సులో పాల్గొని రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారు. ఇక, వాఘేలా రాజీనామాపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ‘రాహుల్ గాంధీ రేపు గుజరాత్‌కు వస్తున్నారు. ‘కాంగ్రెస్‌లో చేరండి’ అనే ప్రచారాన్ని చేపట్టనున్నారు. అయితే గుజరాత్‌లో ‘క్విట్ కాంగ్రెస్ ప్రచారం’ కొనసాగుతోంది’ అని గుజరాత్‌ బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ సెటైర్లు వేశారు. 

ఇదిలా ఉండగా.. గుజరాత్‌ ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. కాగా, గుజరాత్‌ ఎన్నికలపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. అలాగే, ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. గుజరాతీలను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వేలు సైతం ఆప్‌ గెలుస్తుందని చెబుతున్నాయని కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు కూడా చేశారు. 

మరిన్ని వార్తలు