మాజీ మేనేజర్‌ హత్య కేసులో దోషి డేరా బాబా

8 Oct, 2021 13:16 IST|Sakshi

చండీగఢ్‌: డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ సింగ్‌ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడినందుకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరాబాబా ప్రస్తుతం రొహ్‌తక్‌లోని సునరియా జైలులో ఉన్నాడు. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రంజిత్‌ సింగ్‌ కేసుపై శుక్రవారం విచారణ జరిపింది.

ఈ కేసులో క్రిషన్‌ లాల్, జస్బీర్‌ సింగ్, అవ్‌తార్‌ సింగ్, సబ్దిల్‌లను కూడా దోషులుగా తేల్చినట్లు సీబీఐ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌ హెచ్‌పీఎస్‌ శర్మ తెలిపారు. ఈ కేసు తీర్పు ఈ నెల 12వ తేదీన వెలువడనుందని వివరించారు. డేరా ప్రధాన కార్యాలయంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న తీరుపై బయటకు వచ్చిన ఒక ఆకాశరామన్న ఉత్తరం వెనుక రంజిత్‌ సింగ్‌ హస్తం ఉన్నట్లు డేరా చీఫ్‌ అనుమానించాడని, ఆ నేపథ్యంలోనే 2002లో అతడు హత్యకు గురయ్యాడని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. రామ్‌చందర్‌ ఛత్రపతి అనే జర్నలిస్ట్‌ హత్య కేసులోనూ రెండేళ్ల క్రితం డేరాబాబాకు కోర్టు జీవిత ఖైదు విధించింది.   

చదవండి: (సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా)

మరిన్ని వార్తలు