Helicoter Crash: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్‌ సింగ్‌.. వైరలవుతోన్న లేఖ

10 Dec, 2021 13:04 IST|Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్‌ వద్ద డిసెంబర్‌ 8న చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ క్రమంలో వరుణ్‌ సింగ్ రెండు నెలల క్రితం అనగా సెప్టెంబర్‌ 21, 2021న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చండి టెంపుల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో వరుణ్‌ సింగ్‌ చదువుకున్నారు. చదవులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి ఈ లేఖ రాశారు వరుణ్‌ సింగ్‌. 
(చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్‌ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం)

‘‘మీరు చదువులో యావరేజ్‌ స్టూడెంట్స్‌ అని ఎప్పుడు బాధపడకండి. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండటం తప్పేం కాదు. ప్రతి ఒక్కరు 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒకవేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు అయితే మీకు నా అభినందనలు. ఒకవేళ మీరు ర్యాంకర్‌ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుంది అని భావించకండి’’ అని వరుణ్‌ సింగ్‌ సూచించారు.

‘‘మీకు దేని మీద ఆసక్తో దాన్ని గుర్తించండి. సంగీతం, నటన, రచన ఏది అయినా కావచ్చు. దానిలో రాణించేందుకు శ్రమించండి. చదువులో నేనూ యావరేజ్‌ స్టూడెంట్‌నే. ఎప్పుడు టాప్‌ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్క్వాడ్రన్‌లో యువ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా నియమించిన్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఓ విషయం అర్థం అయ్యింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’’ అని వరుణ్‌ సింగ్‌ రాసుకొచ్చారు.  
(చదవండి: ప్రమోషన్‌ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు)

‘‘నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నప్పుడు నేను చదువలో, క్రీడల్లో రాణించలేదు. కానీ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా నియమించినప్పుడు నేను దాని మీద మనసు పెట్టాను. ఆ తర్వాత నాకు విమానాల పట్ల మక్కువ పెరిగింది. అలా నేను మెరుగ్గా పని చేస్తూ.. జీవితంలో ఎదిగాను. తొలుత నేను నా వాస్తవ సామర్థ్యాలను విశ్వసించలేదు. ఈ విషయం నాకు అర్థం అయిన తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకొండి. మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయండి. మార్కులు మన జీవితానికి కొలమానం కాదు’’ అన్నారు వరుణ్‌ సింగ్‌.

అంతేకాక తాను శౌర్య చక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్‌ సింగ్‌ తన లేఖలో తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.  

చదవండి: ఊరే అతడింటికి కదిలొచ్చింది

మరిన్ని వార్తలు