దోపిడికి గురయ్యాను కాపాడాలంటూ ఎమర్జెన్సీ కాల్! తీరా చూస్తే...

4 Nov, 2022 14:58 IST|Sakshi

ఉన్నతాధికారులు తమ కింద స్థాయి ఉద్యోగులు పనితీరును గమనించడం, పరీక్షించడం షరా మాములే. ఐతే అలాంటి సమయంలో కింద స్థాయి ఉద్యోగులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. ఇక్కడోక ఐపీఎస్‌ అధికారి స్థానిక పోలీసులు పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆమె ఏం చేసిందో వింటే షాక్‌ అవుతారు.

వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి చారు నిగామ్‌ మారువేషంలో సన్‌గ్లాస్‌ ధరించి సాయుధ దోపిడికి గురయ్యానంటూ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్‌ చేసింది. తాను ఒక నిర్జన రహదారిపై ఉన్నానని కాపాడండి అంటూ పోలీసులను వేడుకుంది. దీంతో జౌరయ్య పోలీస్టేషన్‌లోని ముగ్గురు పోలీసులు వెంటనే స్పందించి... హుటాహుటిన ఆమె ఉండే ప్రదేశానికి వచ్చి ఆమెను విచారించి సత్వరమే తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. తనను ఇద్దరు సాయుధ వ్యక్తులు దోచుకున్నారంటూ ఫేక్‌ కంప్లైంట్‌ కూడా ఇచ్చింది.

పాపం పోలీసుల సుమారు ఒక గంట పాటు ఆ ప్రాంతంలో ముమ్మరంగా విచారణ చేస్తుంటారు. ఐతే మారువేషంలో ఉన్న ఐపీఎస్‌ వారి పనితీరు అంతా గమనిస్తూ అకస్మాత్తుగా మీ పనితీరు బాగానే ఉందంటూ కితాబ్‌ ఇచ్చింది. అంతే ఒక్కసారిగా పోలీసులకు అసలేం జరుగుతుందో మొదటగా ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె తమ పై అధికారి అని తెలిసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ మేరకు జౌరయ్య పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఎంత క్రూరం! చిన్నారిని కాలితో తన్నాడు.. మరి జనం ఊరుకుంటారా?)

మరిన్ని వార్తలు