హైడ్రోజన్‌ తయారీ ఇక సులువు

26 Nov, 2021 06:31 IST|Sakshi

అద్భుతమైన పరికరాన్ని రూపొందించిన ఐఐటీ వారణాసి పరిశోధకులు

న్యూఢిల్లీ: సాధారణంగా హైడ్రోజన్‌ వాయువు తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నది. సహజ వాయువు తయారీతో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవు తుంది. పైగా అంత సులువైన ప్ర క్రియేమీ కాదు. ఐఐటీ వారణాసి పరిశోధకులు వీటన్నింటికీ చెక్‌ పెడుతూ సులువుగా అప్పటికప్పుడు మిథనాల్‌ నుంచి అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్‌ వాయువును తయారు చేసేందుకు ఓ పరికరాన్ని రూపొందించారు. పెట్రోల్‌ బంకుల్లో స్థాపించి మెంబ్రేన్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. ఇలా ఉత్పత్తయ్యే వాయువుతో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు ఇంధనంగా వాడుకోవచ్చు.

అలాగే దీని నుంచి తయారైన విద్యుత్‌ను ఎలక్ట్రిక్‌ వాహనాలకు చార్జింగ్‌ చేసుకునేందుకు, మొబైల్‌ టవర్లకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుందని ఈ రూపకల్పనలో పాలుపంచుకున్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌ ఉపాధ్యాయ వివరించారు. ఈ పరికరాన్ని వినియోగించడం చాలా సులువని, 2 చదరపు మీటర్ల స్థలంలోనే ఇమిడిపోగలదని చెప్పారు. పైగా 0.6 లీటర్ల మిథనాల్‌ నుంచి దాదాపు 900 లీటర్ల హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చని వెల్లడించారు.  ఈ పరికరాన్ని ఉపయోగించి పీఈఎం ఫుయెల్‌ సెల్‌ సాయంతో 1 కిలోవాట్‌ విద్యుత్‌ను తయారుచేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు