జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవాల్సిందే

26 Nov, 2021 06:24 IST|Sakshi

శక్తిమిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో దోషులకు శిక్ష తగ్గిస్తూ  బాంబే హైకోర్టు తీర్పు

ముంబై: ‘మరణశిక్ష అనేది దోషులకు పశ్చాత్తాపం నుంచి వెంటనే విముక్తి పొందేలా చేస్తుంది. జీవితఖైదు విధిస్తేనే వారు జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోతారు’ అంటూ సామూ హిక అత్యాచార కేసు దోషుల మరణశిక్ష నుంచి జీవితఖైదుకు తగ్గిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. ‘ రేప్‌ అనేది అత్యంత హేయమైన చర్య. బాధితురాలు శారీరకంగానే కాదు మానసికం గానూ అత్యంత వేదనకు గురవుతారు.

మహిళ గౌరవాన్ని కించపరుస్తూ, అత్యంత తీవ్రస్థాయిలో ఉల్లంఘనకు పాల్పడిన ఈ దోషులెవరూ జీవితకాలంలో ఎన్నడూ సమాజంలోకి తిరిగి వెళ్లలేరు. జీవితాంతం తమ ఘోరమైన నేరానికి పశ్చాత్తాపం చెందాలంటే మరణశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షే సరైంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2013 ఆగస్ట్‌ 22న సెంట్రల్‌ ముంబైలోని నిరుపయోగంగా ఉన్న శక్తి మిల్స్‌ కాంపౌండ్‌లో 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై ఐదుగురు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన ఐదుగురుకీ మరణశిక్ష విధిస్తూ ఏడేళ్ల క్రితమే ట్రయల్‌ కోర్టు శిక్ష ఖరారుచేసింది.

వీరిలో విజయ్‌ జాధవ్, మొహమ్మద్‌ ఖాసిం బెంగాలీ షేక్, మొహమ్మద్‌ అన్సారీ మరణశిక్షను సవాల్‌ చేస్తూ 2014 ఏప్రిల్‌లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్‌ సాధనా జాధవ్, జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ల డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది. ‘ దోషులకు మరణశిక్ష సరిపోదు. అంతకు మించిన శిక్ష విధించాలి. జీవితాంతం వీరు పశ్చాత్తాపంతో కుంగిపోవాలనే ఉద్దేశంతోనే, కింది కోర్టు ఖరారుచేసిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’ అని హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. ‘ ఏ నేరానికి ఏ శిక్ష అనే విధానంలో.. ఇలాంటి దారుణమైన ఘటనల్లో మరణశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించాలనే ఒక నియమంగా పెట్టాలి’ అని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ‘సంచలనం రేపిన ఈ కేసులో ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులు చెప్పడం కుదరదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు