అమిత్‌షా కార్యక్రమంలో.. 30వేల కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టిన అధికారులు

30 Jul, 2022 18:33 IST|Sakshi

చండీగఢ్‌: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 30వేల కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టారు అధికారులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. పంజాబ్ చండీగఢ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్, నేషనల్ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమయంలో అధికారులు ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో మొత్తం 30వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌'ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 75వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని ప్రతిజ్ఞ చేశామని అమిత్‌షా వెల్లడించారు. ఇప్పటికే 81వేల కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టామని వెల్లడించారు. ఆగస్టు 15నాటికి లక్ష కిలోల డ్రగ్స్ ధ్వంసం చేయాలని లక్ష‍్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

డ్రగ్స్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జూన్ 1న మొదలుపెట్టింది. జులై 29నాటికి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టింది. తాజాగా అమిత్‌షా కార్యక్రమంలో మరో 30వేల కిలోల డ్రగ్స్‌ను నిర్వీర్యం చేసింది.
చదవండి: ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు! 300 మంది ఫోటోలతో విచారణ

మరిన్ని వార్తలు