భారీ ఎత్తున సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకుల మోహరింపు

2 Sep, 2020 13:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. తూర్పు లదాఖ్‌లో దూకుడుగా ముందుకు సాగుతున్న జవాన్లు... ప్యాంగ్యాంగ్‌ సో సరస్సు దక్షిణ భాగాన కీలక శిఖరాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్‌ సైనికులకు సరైన సమాధానం ఇవ్వాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో భారత ఆర్మీ ఈ మేరకు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీ ఎత్తున సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకులను మోహరించాయి. దీంతో భారత్‌- చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చదవండి: సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా)

కాగా ప్యాంగ్యాంగ్‌ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ చైనా మిలిటరీ సోమవారం దుస్సాహసానికి దిగిన విషయం తెలిసిందే. ఇందుకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం.. డ్రాగన్‌ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇరు దేశాలు మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్‌ వైపున్న చుషుల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి అధికారులు చర్చలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: భారత్, చైనా మిలటరీ చర్చలు)

>
మరిన్ని వార్తలు