రెండు నెలల గరిష్ట స్థాయికి కేసులు

3 Sep, 2021 06:15 IST|Sakshi

కొత్తగా 47 వేల కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ నెమ్మదిగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో ఎప్పుడూ నమోదుకానంతటి స్థాయిలో గురువారం ఒక్క రోజే 47,092 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. కేరళ రాష్ట్రంలో గురువారం 32,097 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 188 మంది మరణించారు.మరో 509 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో దేశంలో కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 4,39,529కు పెరిగింది. రికవరీ రేటు 97.48 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.8 శాతానికి చేరుకుంది.  దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 81.09 లక్షల టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇప్పటిదాకా 66.30 కోట్ల టీకాలు ఇవ్వడం పూర్తయింది.

అర్హుల్లో సగం మందికిపైగా టీకా
కరోనా టీకా తీసుకోవడానికి అర్హులైన వారిలో 54 శాతం మందికి కనీసం ఒక డోస్‌ టీకా ఇచ్చామని కేంద్రం వెల్లడించింది. అర్హులైన జనాభాలో 16 శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. సిక్కిం, దాద్రా, నగర్‌ హవేలీ, హిమాచల్‌లో యుక్తవయసు వారందరికీ కనీసం ఒక డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. ఆగస్ట్‌ నెల చివరి ఏడు రోజుల్లో సగటున రోజుకు 80.27 లక్షల టీకాలు ఇచ్చామన్నారు. దేశంలోని మొత్తం హెల్త్‌కేర్‌ వర్కర్లలో 99 శాతం మందికి ఒక టీకా, 84 శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చారు.

మరిన్ని వార్తలు