ITPO complex: ‘భారత మండపం’ రెడీ

27 Jul, 2023 04:43 IST|Sakshi
పూజలు చేస్తున్న ప్రధాని మోదీ, ఢిలీలోని నూతన ఐటీపీఓ కాంప్లెక్స్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ–20 సదస్సుకి వేదిక సిద్ధమైంది. సెపె్టంబర్‌లో జరగనున్న ఈ సదస్సుకి అమెరికా, బ్రిటన్, చైనా సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సుని నిర్వహించడానికి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (ఐఈసీసీ)కు కొత్తగా హంగులు చేకూర్చారు. మరమ్మతులు నిర్వహించి ఆధునీకరించారు. ఈ సెంటర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి దానికి కొత్తగా భారత మండపం అని పేరు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్, ఇతర మంత్రుల సమక్షంలో డ్రోన్‌ ద్వారా ఈ సెంటర్‌ని ప్రారంభించారు.

ఐఈసీసీ కాంప్లెక్స్‌ని జాతీయ ప్రాజెక్టు కింద రూ.2,700 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రగతి మైదాన్‌లో  ఇండియా ట్రేడ్‌ ప్రొమోషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐటీపీఒ) కాంప్లెక్స్‌లో ఇది భాగంగా ఉంది. అంతకు ముందు ప్రధాని మోదీ  ఐటీపీఒలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాంప్లెక్స్‌ మరమ్మతు పనుల్లో పాల్గొన్న కార్మికుల్ని ప్రధాని సత్కరించారు. ప్రగతి మైదాన్‌ దాదాపుగా 123 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. భారత్‌లో అంతర్జాతీయ సదస్సులు , పారిశ్రామిక సమావేశాలు నిర్వహించే కాంప్లెక్స్‌లో అతి పెద్దది. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐఈసీసీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన టాప్‌ –10 వేదికల్లో ఒకటి. మూడో అంతస్తులు ఏడువేల మంది పట్టే ఒక కాన్ఫరెన్స్‌ హాలు ఉంది.  జీ–20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారతీయత ఉట్టిపడేలా దీనిని నిర్మించడంతో భారత మండపం అని పేరు పెట్టారు. 

మరిన్ని వార్తలు