మణిపూర్‌ విషయంలో మద్దతివ్వండి.. భారత ఆర్మీ విజ్ఞప్తి 

28 Jun, 2023 06:59 IST|Sakshi

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రజలు తమకు సహాయం చేయాలని భారత ఆర్మీ కోరింది. సహాయక చర్యలందించడానికి తాము వెళ్లకుండా మహిళా ఉద్యమకారులు రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తున్నారని, తమ కార్యకలపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆర్మీ తెలిపింది. ఇలాంటి అనవసర జోక్యం వల్ల భద్రతా బలగాలు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నాయని ఆర్మీ ట్విట్టర్‌లో సోమవారం ఓ వీడియో విడుదల చేసింది. 

‘‘శాంతి పునరుద్ధరణకోసం కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలను ఇండియన్‌ ఆర్మీ కోరుతోంది. మణిపూర్‌కు సాయం చేసేందుకు మాకు సాయం చేయండి’’ అంటూ ట్వీట్‌ చేసింది. తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో ఆర్మీ, మహిళల నేతృత్వంలోని ఓ సమూహం మధ్య శనివారం రోజంతా ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఆర్మీ 12 మంది ఉగ్రవాదులను వదిలిపెట్టింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఆర్మీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

2015లో 6 డోగ్రా యూనిట్‌పై ఆకస్మిక దాడితో సహా అనేక దాడుల్లో పాల్గొన్న మైతీ మిలిటెంట్‌ గ్రూప్‌ అయిన కంగ్లీ యావోల్‌ కన్న లుప్‌ (కేవైకేఎల్‌)కు చెందిన 12 మంది సభ్యులు గ్రామంలో దాగి ఉన్నారని వారు తెలిపారు. భద్రతా సిబ్బంది ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో మే 3న ’ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మొదట ఘర్షణలు చెలరేగడం, ఈశాన్య రాష్ట్రంలో మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య చెలరేగిన హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలకు సహకరించండి అంటూ ఆర్మీ విజ్ఞప్తి చేస్తోంది.    

ఇది కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ సీఎంకు తప్పిన పెను ప్రమాదం 

మరిన్ని వార్తలు