క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌; సెలెక్ట్‌ అయితే చదువుతో పాటు జాబ్‌ పక్కా

7 Oct, 2021 19:35 IST|Sakshi

10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్‌

70 శాతం మార్కులతో ఇంటర్‌ ఎంపీసీ ఉత్తీర్ణులు అర్హులు

జేఈఈ మెయిన్‌–2021 పరీక్ష రాసి ఉండాలి

త్రివిధ దళాల్లో కొలువు.. దేశంలో ఎంతోమంది యువత కల.ఎందుకంటే..సవాళ్లతోపాటు దేశ సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ భద్రత,ఆకర్షణీయ వేతనాలు, కెరీర్‌లో ఎదిగేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. అలాంటి చక్కటి కొలువును చిన్న వయసులోనే అందుకునే వీలు కల్పిస్తోంది.. ఇండియన్‌ నేవీ. ఇటీవల 2021 సంవత్సరానికి సంబంధించి ఇండియన్‌ నేవీ 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు 2022 జనవరిలో ప్రారంభమవుతుంది. 

► మొత్తం ఖాళీల సంఖ్య: 35 (ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌–05, ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌–30).


అర్హతలు

► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 70 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరంలో ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు స్కోర్‌ చేయాలి. 

► వయసు: 02.07.2002 నుంచి 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి.

► అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 

► వీటితోపాటు జేఈఈ మెయిన్‌–2021(బీఈ/బీటెక్‌)కు హాజరై ఉండాలి. ఇందులో సాధించిన ఆల్‌ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. 


ఎంపిక విధానం

► జేఈఈ మెయిన్‌–2021 ర్యాంకు ద్వారా షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ సమాచారాన్ని ఈమెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. 

► ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను బెంగళూరు/భోపాల్‌/కోల్‌కతా/విశాఖపట్నంల్లో ఏదోఒకచోట నిర్వహిస్తారు.

► ఈ ఇంటర్వ్యూలు 2021 అక్టోబర్‌/నవంబర్‌ల్లో జరిగే అవకాశం ఉంది.

► ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. 

► తొలి రోజు స్టేజ్‌–1 ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్‌ టెస్ట్, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. వీటిలో విజయం సాధించిన వారికే స్టేజ్‌ 2కు అనుమతిస్తారు. 

► స్టేజ్‌ 2 నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సైకలాజికల్‌ టెస్ట్‌లు, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌లు, ముఖాముఖి పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్‌ 2లోనూ ప్రతిభ చూపిన వారికి మెడికల్‌ టెస్టులు ఉంటాయి. ఇందులోను గట్టెక్కితే తుది విజేతగా ప్రకటిస్తారు. 

శిక్షణ
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల(కేరళ)లో బీటెక్‌ అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ శిక్షణ సమయంలో చదువుతోపాటు భోజనం, వసతి, బుక్స్, యూనిఫారం మొత్తం ఉచితంగా అందిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి జేఎన్‌యూ బీటెక్‌ డిగ్రీ ప్రదానం చేస్తుంది. అనంతరం సబ్‌ లెఫ్ట్‌నెట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 

కెరీర్‌ స్కోప్‌
ఎంచుకున్న కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ విధులు కేటాయిస్తారు. ఉద్యోగంలో చేరితే ప్రారంభంలో లెవెల్‌–10 మూల వేతనం అంటే రూ.56100 అందుతుంది. దీంతోపాటు మిలిటరీ సర్వీస్‌ పే కింద రూ.15000 ఇస్తారు. అలాగే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ సమయంలో అన్ని కలిపి నెలకు రూ.లక్ష వరకూ వేతనం అందుకునే అవకాశ ఉంది. 

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

మరిన్ని వార్తలు