Food Diets For Healthy Heart: చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు?

16 Jun, 2022 10:57 IST|Sakshi

మొన్న కన్నడ సినీహీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌.. నిన్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. తాజాగా గాయకుడు కేకే.. 
గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే మరణించిన వారు వీరందరూ! ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పైన ఉదహరించిన వారంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేవారే. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. పుష్టికరమైన ఆహారం తీసుకునే వారే. అయినా సరే చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కారణాలేమైనా... ఈ ఘటనల సారాంశం ఒక్కటే! అది ఆరోగ్యంపై పురుషులు మరింత శ్రద్ధ వహించాలని. అంతర్జాతీయ పురుషుల
ఆరోగ్య వారోత్సవాల (జూన్‌ 13 – 19)నేపథ్యంలో ఆహారం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందడం ఎలాగో చూద్దాం...

ప్రొటీన్‌ మోతాదు పెంచండి...
మనం తినే ఆహారం.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు. ప్రతీదీ తగు మోతాదులో అవసరం. ఆహార అలవాట్ల ప్రకారం మనం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటాం. ఇలా కాకుండా... భోజనంలో ఎంతో కొంత ప్రొటీన్లను కూడా తీసుకోగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్లు మొదలుకొని పన్నీర్, పరాఠా, చేపలు, రాజ్మా, సాంబార్, బీన్స్, సోయా పులావ్‌ వంటి వెజ్‌/నాన్‌వెజ్‌ ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ లభిస్తుంది.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రమాణాల ప్రకారం ప్రతి భారతీయుడు రోజుకు కనీసం 48 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవడం అవసరం. ఇంకోలా చెప్పాలంటే ప్రతి కిలోగ్రాము బరువుకు ఒక గ్రాము ప్రొటీన్‌ అవసరమవుతుంది. అయితే నూటికి 80 శాతం మంది అవసరమైన దానికంటే తక్కువ ప్రొటీన్‌ తీసుకుంటున్నారు. కండరాలు బలోపేతమయ్యేందుకు మాత్రమే కాకుండా... రోగ నిరోధక శక్తిని పెంచేందుకూ, ఒత్తిడికి విరుగుడుగా పనిచేసే సెరటోనిన్‌ ఉత్పత్తికీ ప్రొటీన్‌ అత్యవసరమన్న విషయం పురుషులు గుర్తించాలి. 

ఐదారు సార్లు పండ్లూ, కాయగూరలు!
మెరుగైన ఆరోగ్యం కోసం కాయగూరలు, పండ్లు అవసరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు అందేందుకు ఇదే మేలైన దారి. జాతీయ పోషకాహార సంస్థ అంచనాల ప్రకారం రోజు కనీసం 400గ్రాముల కాయగూరలు, పండ్లు తినాల్సి ఉండగా.. చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవడం లేదు. వీటిలోని పీచు పదార్థం జీర్ణకోశం మెరుగ్గా పనిచేసేందుకు, యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి.ఏ కాయగూరనైనా ఏదో ఒక రూపంలో శరీరానికి అందివ్వడం మేలు. 

మితమే.. హితం!
ఎంత తింటే అంత బలం కాదు.. మితమే హితమకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక పాటించాలి. చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉన్న ఆహారం విష యంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. నోరు కుట్టేసుకుని ఉండటం ఎలా అనిపిస్తే... అన్ని రకాల ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకుంటే సరి. 

పాల ఉత్పత్తులు...
పాల ఉత్పత్తుల వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రోజూ వాడాలని కొందరు, అవసరమే లేదని కొందరు చెబుతారు. పెరుగు, మజ్జిగల రూపంలో తీసుకునే విషయంలో మాత్రం ఎవరికీ అభ్యంతరాలు లేవు. అయితే ఎంత మోతాదులో అన్నది ఒక ప్రశ్న. నిపుణులు చెప్పిన దాని ప్రకారం రోజుకు ఏదో ఒక రూపంలో కనీసం 300 మిల్లీలీటర్ల పాలు/పాల ఉత్పత్తులు శరీరానికి అందించడం మేలు.

చిరుతిళ్లతోనూ చిక్కులు..
సాయంత్రం చిరుతిళ్లు తినాలనిపించడం సహజం. అలాంటి సందర్భాల్లో నూనె పదార్థాలు కాకుండా.. మొలకెత్తిన గింజలు, ఉడికించిన శనగలు, వేరుశనగ పప్పుల్లాంటివి తినడం మేలు. వీటివల్ల శరీరానికి శక్తి, ప్రొటీన్లు రెండూ లభిస్తాయి.


ఉప్పుతో ముప్పు...
ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చదువుతూనే ఉన్నాం. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దు. కానీ.. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. శుద్ధీకరించిన ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి...
వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మేలు. 

ఈ ఆహారపు అలవాట్లకు తోడుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. నలభై ఏళ్లు దాటిన తరువాతైనా తరచూ వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా పురుషులు ఆకస్మిక మరణాలను కొంతవరకైనా నివారించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు