Jagannath Rath Yatra 2022: అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

2 Jul, 2022 18:19 IST|Sakshi

భక్తజన సంద్రంగా పూరీ  

పూరీ (ఒడిశా): ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా మొదలైంది.  శుక్రవారం ఉదయం మొదలైన ఈ యాత్ర తొమ్మిది రోజులు సాగుతుంది. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా ఈ యాత్రను నిర్వహించలేదు. దీంతో ఈ యాత్రకి భక్తులు వెల్లువెత్తారు.

పూరీ పట్టణం భక్తజన సంద్రంగా మారింది. జై జగన్నాథ, హరిబోల్‌ నామస్మరణతో చుట్టుపక్కల ప్రాంతాలు మారుమోగాయి.అంతరాలయం నుంచి చతుర్థా మూర్తులు బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనునితో పాటు మదన మోహనుడు, రామ, కృష్ణ ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో రథాలపైకి తరలించారు. మంగళస్నానాలు, సకలధూపం, హారతి వంటివి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి, ఆయన శిష్యులు కొందరు జగన్నాథుడిని తొలి దర్శనం చేసుకున్నారు.

పూరీ గజపతి వంశం మహారాజు దివ్యసింగ్‌ దేబ్‌ బంగారు చీపురుతో రథాలన్నీ శుభ్రం చేశారు. ఆ దేవదేవుడి ముందు అందరూ సమానమేనన్న సందేశాన్ని ఇవ్వడానికే మహరాజులే ఈ రథాలను ఊడుస్తారు. ఏడాదిపాటు పూరీ జగన్నాథ ఆలయ గర్భగుడిలో ఉండే సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు ఆషాఢ మాసం శుక్లపక్ష విదియనాడు ఈ యాత్ర మొదలవుతుంది. మొదట తాళధ్వజ రథంపై బలభద్రుడుని తీసుకువచ్చారు.

ఆ తర్వాత దర్పదళన్‌ రథంపై సుభద్ర, చివరగా నందిఘోష్‌ రథంపై జగన్నాథుడిని ఊరేగింపుగా గుండిచా మందిరానికి బయల్దేరాయి. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, గవర్నర్‌ గణేషిలాల్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హాజరై లాంఛనంగా రథాల్ని లాగి యాత్రను ప్రారంభించారు.  భక్తులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాల్లో కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.


యాత్రను పురస్కరించుకుని మూల విరాటులను వరుస క్రమంలో రథాలపైకి ఎక్కించి, దించడం గొట్టి పొహొండిగా వ్యవహరిస్తారు. గుండిచా మందిరం అడపా మండపంపై కొలువు దీరిన జగన్నాథుని దర్శించుకుంటే జీవితం పావనం అవుతుందని భక్తులు విశ్వాసం. ఈ ప్రాంగణంలో స్వామికి నివేదించిన అన్న ప్రసాదాలు(ఒభొడా) లభించడం పుణ్యప్రదంగా భావిస్తారు. శ్రీమందిరానికి యథాతధంగా తరలి వచ్చేలోగా జరిగే ప్రత్యేక ఉత్సవాలు యాత్రికుల్ని మరింత ఉత్సాహపరుస్తాయి. వీటిలో హిరా పంచమి, సంధ్యా దర్శనం(నవమి), మారు రథయాత్ర(బహుడా), హరి శయన ఏకాదశి(స్వర్ణాలంకారం), అధర సేవ, గరుడ శయనసేవ, నీలాద్రి విజే ప్రధానమైనవి.


 


 

మరిన్ని వార్తలు