వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్‌ కోసం నది దాటి

5 Jun, 2021 14:40 IST|Sakshi
నది దాటుతూ వెళ్తున్న ఆరోగ్య సిబ్బంది

కశ్మీర్‌: హిమాలయ రాష్ట్రం జమ్మూకశ్మీర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. కొండలు.. లోయలు.. నదులు దాటుకుంటూ వెళ్లేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. నది దాటుతూ ఆరోగ్య సిబ్బంది వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. వారి పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటన రాజౌరి జిల్లాలో జరిగింది.

రాజౌరి జిల్లాలోని కంది బ్లాక్‌ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్‌ వేసేందుకు ఆరోగ్య సిబ్బంది నలుగురు బయల్దేరారు. అయితే మార్గమధ్యలో తావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా కూడా ఆ సిబ్బంది నదిలో నడుస్తూ వెళ్లారు. మోకాలి లోతు నీరు చేరగా ఓ వ్యక్తి సహాయంతో వ్యాక్సిన్‌ డబ్బాలు పట్టుకుని అతి జాగ్రత్తగా నది దాటారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి సహాయంతో మహిళలు అతి కష్టంగా నది దాటుతున్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. 

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసినట్లు కంది ప్రాంత బ్లాక్‌ వైద్యాధికారి డాక్టర్‌ ఇక్బాల్‌ మాలిక్‌ తెలిపారు. తమ పరిధిలోని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ వైద్య సిబ్బందిని అభినందించారు. జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా 33,98,095 డోసుల వ్యాక్సిన్‌ వేశారు.

మరిన్ని వార్తలు