JNU: స్టూడెంట్స్ యూనియ‌న్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ.. విద్యార్థులకు గాయాలు

11 Apr, 2022 16:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్‌యూ వ‌ర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియ‌న్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలపై సోమవారం జేఎన్‌యూ రిజిస్ట్రార్ విద్యార్థులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వర్సిటీలో విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ ఓ నోటీసులో హెచ్చరించారు. జేఎన్‌యూ వ‌ర్సిటీలో హింసకు పాల్పడితే సహించేది లేదన్నారు. శాంతికి భంగం క‌లిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పార‌ని ఆ లేఖ‌లో రిజిస్ట్రార్ తెలిపారు.

ఇదిలా ఉండగా..  శ్రీరామ‌న‌వ‌మి పూజ‌ సందర్బంగా వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మ‌ధ్య ఆదివారం ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ సందర్బంగా వర్సిటీ హాస్టల్‌లో నాన్‌ వెజ్‌ వండటం వల్లే ఘర్షణ తలెత్తినట్టు ఓ విద్యార్థి సంఘం నేత పేర్కొనగా.. తామేమీ నాన్ వెజ్ ఫుడ్‌కు వ్య‌తిరేకం కాదు అని, హాస్ట‌ల్‌లో ఏదైనా తిన‌వ‌చ్చు అని మరో విద్యార్థి సంఘం నేత తెలిపారు.

 ఇక, ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్‌, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు గుర్తు తెలియ‌ని ఏబీవీపీ విద్యార్తుల‌పై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు