సూపర్‌ ఉమెన్‌.. ఆమె తెగువకు సీఎం స్టాలిన్‌ ప్రశంసలు..

26 Mar, 2022 17:16 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆమె ఓ మహిళా అధికారి.. రాత్రివేళ అని కూడా చూడకుండా తన విధి నిర‍్వహణలో తెగువ చూపించింది. అర్థరాత్రి సైకిల్‌పై పెట్రోలింగ్‌ చేసి ఆమె చూపించిన సాహసం తమిళనాడు సీఎం స్టాలిన్‌ సైతం మెప్పించింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరూ అనుకుంటున్నారా..?

చెన్నై నార్త్ జోన్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణి, జాయింట్‌ కమిషనర్‌ ఆర్‌వీ రమ్యా భారతి.. గురువారం అర్ధరాత్రి విధుల్లో భాగంగా సైకిల్‌పై పెట్రోలింగ్‌కు వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు రైడ్ చేస్తూ ఉత్తర చెన్నైలో దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. వాలాజా పాయింట్ నుండి ఆమె పెట్రోలింగ్‌ ప్రారంభించి ముత్తుసామి బ్రిడ్జి, రాజా అన్నామలై మండ్రం, ఎస్ప్లానేడ్ రోడ్, కురలగం, ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్, మింట్ జంక్షన్, వాల్ టాక్స్ రోడ్, ఎన్నూర్ హై రోడ్, ఆర్కేనగర్, తిరువొత్తియూర్ హై రోడ్‌తో సహా అనేక ప్రాంతాలను ఆమె కవర్ చేశారు. తన పెట్రోలింగ్‌లో భాగంగా పలువురు అనుమానితులను సైతం ఆమె పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చూపించిన తెగువ తమిళనాడులో హాట్‌ టాపిక్‌ మారింది.

ఈ విషయం కాస్తా సీఎంకు చేరడంతో స్టాలిన్‌ స్పందించారు. ముఖ్యమంత్రి ట‍్విట్టర్‌ వేదికగా..‘‘రమ్యా భారతికి అభినందనలు.. తమిళనాడులో మహిళలపై హింసను తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాను అంటూ కామెంట్స్‌ చేశారు. అనంతరం, విధి నిర్వహణలో భాగంగా అర్దరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ మహిళల భద్రతను పర్యవేక్షించిన ఐపీఎస్ రమ్యా భారతిపై తమిళనాడు పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. దీంతో, ఆమెను డ్రగ్స్‌పై డ్రైవ్‌కు నోడల్ ఆఫీసర్‌గా చెన్నై పోలీస్ కమిషనర్ నియమించారు. ఈ క్రమంలో ఒక్క రాత్రిలోనే ఆమె వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. రాష్ట్రంలో మహిళా పోలీసులకు ఆమె ఆదర్శంగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు