రక్త హస్తాలతో సాయం కోసం.. మానవత్వం సిగ్గుపడే ఘటన.. జరిగింది ఇదే!

25 Oct, 2022 16:00 IST|Sakshi

వైరల్‌/లక్నో: తీవ్ర గాయాలపాలై.. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ బాలిక వీడియో సోషల్‌ మీడియాను కుదిపేసిన సంగతి తెలిసిందే. సాయం కోసం ఆమె చేతులు చాస్తుంటే, ముందుకు వచ్చిన వాళ్లు కేవలం వీడియోలు తీస్తూ గడిపేయడం.. విపరీతంగా వైరల్‌ అయ్యింది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇదంటూ కొందరు ఆ వీడియోకు కామెంట్లు సైతం చేస్తున్నారు. ఈ తరుణంలో.. 

దీనికి కొనసాగింపు వీడియో ఒకటి ఇప్పుడు సర్క్యూలేట్‌ అవుతోంది. సాయానికి ఎవరూ ముందుకు రాని తరుణంలో.. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నాడు ఓ పోలీసాయన. ఆపై ఆ బాలికను ఎత్తుకుని పరుగులు తీశారు. ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్‌ కన్నౌజ్‌ గవర్నమెంట్‌ గెస్ట్‌ హౌజ్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధిత బాలిక(13/14 ఏళ్ల వయసు).. తన పిగ్గీ బ్యాంక్‌ను మార్చుకునేందుకు ఆదివారం మధ్యాహ్నాం పూట ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఆ మార్కెట్‌కు దగ్గర్లోనే గవర్నమెంట్‌ గెస్ట్‌ హౌజ్‌ దగ్గర పొదల్లో.. ఆమె గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. అది గుర్తించిన గెస్ట్‌ హౌజ్‌ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. ఈ లోపు స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను వీడియో తీయడం ప్రారంభించారు.

ఇక బాధిత బాలికపై అఘాయిత్యం జరిగి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై గాయాలతో పాటు తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీసీఫుటేజీలో బాలిక ఓ వ్యక్తితో మాట్లాడినట్లు.. అతని వెంట వెళ్లినట్లు ఉంది. దీంతో అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Warning: Disturbing video

మరిన్ని వార్తలు