అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు ఆ గ్రామాన్నే ఖాళీ చేశారు!

2 Jun, 2022 15:15 IST|Sakshi

హోసూరు(బెంగళూరు): క్రిష్ణగిరి జిల్లాలో అడవుల విస్తీర్ణం అధికం. కొన్ని గ్రామాల్లో అడవుల్లో విసిరేసినట్లుగా ఉంటాయి. అక్కడికి రోడ్లు ఉండవు. కాలిబాటల్లోనే వెళ్లాలి. మధ్యలో అడవి ఏనుగులు, వన్యమృగాల దాడులు జరుగుతూ ఉండవచ్చు. వీటికి తోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఒక గ్రామాన్నే ఖాళీ చేశారు. డెంకణీకోట సమీపంలోని క్రిష్ణగిరి– ధర్మపురి జిల్లా సరిహద్దుల్లో దట్టమైన అడవిలో ఉండే పుల్లహళ్లి గ్రామం కథ ఇది. ఈ ఊరు పాడుబడిన నివాసాలతో ఖాళీగా దర్శనమిస్తుంది.  


మొండిగోడలే మిగిలాయి

ఒకప్పుడు కళకళ
ఒకప్పుడు ఈ పల్లెలో వందకుపైగా కుటుంబాలు ఉండేవి. గ్రామస్థులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఈ గ్రామానికి వెళ్లాలంటే ధర్మపురి జిల్లా పంజపల్లి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగులు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడేవారు. రోజూ బడికి వెళ్లాలన్నా, ఆస్పత్రికి పోవాలన్నా అన్ని కిలోమీటర్లు నడవలేక అలసిపోయేవారు. దీంతో ఈ ఊరివారితో పెళ్లి సంబంధాలు కలుపుకోవాలన్నా వేరేఊరివారు భయపడేవారు.

తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రజలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. గత్యంతరం లేక గ్రామస్థులు సుమారు ఐదారేళ్ల కిందట ఏకంగా గ్రామాన్నే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడా గ్రామంలో ఒక్క మనిషి కూడా లేక నిర్మానుష్యంగా మారిపోయింది. ఇళ్లు శిథిలావస్థకు చేరుకొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామానికి రోడ్లు, ఆస్పత్రి, బడి వంటి వసతులను కల్పించి నివాసయోగం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

చదవండి: Job Opportunities: ‘చిప్స్‌’.. ఇప్పుడు హాట్‌టాపిక్‌! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు!

మరిన్ని వార్తలు