రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు

24 Oct, 2023 07:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో దసరా సందర్భంగా నేడు నిర్వహించే రామ్‌లీలను సందర్శించేందుకు నేతలు, ప్రముఖులు తరలిరానున్నారు. ఎర్రకోట మైదానంలో ధార్మిక లీల కమిటీ, లవకుశ రామలీల కమిటీలతో పాటు వివిధ కమిటీల నేతలు రామ్‌లీల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ వస్తారని ధార్మిక్ లీల కమిటీ అధికార ప్రతినిధి రవి జైన్ తెలపగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సినీ నటి కంగనా రనౌత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని లవకుశ రామ్‌లీల కమిటీ చైర్మన్ అర్జున్ కుమార్  తెలిపారు. సోనియా గాంధీ కూడా తమ​ ఆహ్వానం మేరకు వస్తున్నారని నవశ్రీ రిలీజియస్ లీల కమిటీ అధికార ప్రతినిధి రాహుల్ శర్మ అన్నారు.

 శ్రీరామ్‌లీలా కమిటీ చైర్మన్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ మైదానంలో రామ్‌లీలను నిర్వహిస్తున్న శ్రీరామ్ ధార్మిక రామ్‌లీల కమిటీ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరుకానున్నారని తెలిపారు. దేరావాల్ నగర్‌లోని నవశ్రీ మానవ్ ధరమ్ రామ్‌లీల కమిటీ  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీ మనోజ్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తాము నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కానున్నారని ఇంద్రప్రస్థ రామ్‌లీల కమిటీ  ప్రతినిధి సురేష్ బిందాల్ చెప్పారు.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి

మరిన్ని వార్తలు