లవ్‌ జిహాద్‌: హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

5 Nov, 2020 14:59 IST|Sakshi

బెంగళూరు: ప్రస్తుతం దేశవ్యాప్తంగా లవ్‌ జిహాద్‌’పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. మతాంతర వివాహాలకు విరుద్ధంగా చట్టాల రూపకల్పనకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ ‘‘లవ్‌ జిహాద్’‌ అనేది ఓ దుష్టశక్తి అని.. ఇందుకు విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదించిందని.. త్వరలోనే చట్టం రూపొందిస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ మేరకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లవ్‌ జిహాద్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయం గురించి ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించాం. ఆ నిర్ణయాల మేరకు కొత్త చట్టాన్ని రూపొందిస్తాం’ అన్నారు. 

కాగా లవ్‌ జిహాద్‌ అనే పదాన్ని రైట్‌ వింగ్స్‌ గ్రూపులు వాడుకలోకి తెచ్చాయి. ఇది ముస్లిం అబ్బాయి, హిందూ యువతి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ బంధంలో ఆడపిల్లలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మాయ్‌ మాట్లాడుతూ.. ‘అలహాబాద్‌ హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటకలో కూడా ఓ చట్టం తీసుకురాబోతున్నాం. కేవలం వివాహం కోసం మతం మార్చుకోవడం అంగీకారం కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. అదే విధంగా.. మరో ట్వీట్‌లో ముస్లిం యువకులను జిహాదీలతో పోల్చారు బొమ్మాయ్‌.  వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. మతాంతర వివాహం చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: లవ్‌ జిహాద్‌: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా