సజీవదహనం వెనుక కుట్రకోణం

25 Mar, 2022 04:44 IST|Sakshi
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న మమత

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణ

బాధిత కుటుంబాలకు సీఎం పరామర్శ

సజీవ దహనానికి ముందు చితకబాదినట్లు పోస్టుమార్టమ్‌ నివేదిక

బీర్‌భూమ్‌ (పశ్చిమబెంగాల్‌): పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లాలో ఎనిమిది మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న హింసాత్మక గృహదహనాలు జరిగిన రామ్‌పూర్‌హట్‌ గ్రామాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆధునిక బెంగాల్‌లో ఇలాంటి అనాగరిక ఘటనలు జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.

మీ కుటుంబ సభ్యులు మరణిస్తే,  నా గుండె పిండేసినట్టుందని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ఘటన వెనుకాల భారీ కుట్ర ఉందన్న మమత ఈ కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ప్రమేయం ఉంటే వెంటనే అరెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. రామ్‌పూర్‌హట్‌ మారణకాండకు బాధ్యులైన వారిని విడిచిపెట్టమన్న మమత ఈ ఘటనని అడ్డుకోలేకపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు. మరోవైపు మృతుల పోస్టుమార్టమ్‌ నివేదికలో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. 

ఆ ఎనిమిది మందిని సజీవంగా దహనం చేయడానికి ముందు వారిని బాగా చితక బాదినట్టుగా పోస్టుమార్టమ్‌ నివేదిక వెల్లడించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు  బాద్‌ షేక్‌ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న పలు ఇళ్లకు నిప్పటించి తగుల బెట్టిన ఘటనలో ఎనిమిది కాలిన మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మమతా బెనర్జీ బాధితుల్ని పరామర్శించిన వెంటనే  గృహదహనాల వెనుక హస్తం ఉందని అనుమానిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ బ్లాక్‌ అధ్యక్షుడు అనిరుల్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటన వెనుకనున్న వాస్తవాలను వెలికి తీయడానికి బీజేపీకి చెందిన కేంద్ర కమిటీలో గ్రామంలో పర్యటిస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు