Mamata Banerjee: సీఎం మమత ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు.. రాత్రంతా అక్కడే.. తలలు పట్టుకున్న పోలీసులు!

5 Jul, 2022 11:03 IST|Sakshi

కోల్‌కత: జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి అర్ధరాత్రి ప్రవేశించాడు ఓ ఆగంతకుడు. రాత్రంతా ఆ ప్రాంగణంలోనే ఉన్నాడు. ఉదయం 8 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తిని సీఎం నివాసం ఆవరణలో చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ అనుకొని తాను సీఎం నివాసంలోకి ప్రవేశించినట్లు నిందితుడు తెలిపాడు. 

కానీ అర్ధరాత్రి సమయంలో పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏం పని? అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేక తడబడ్డాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అర్ధరాత్రి సీఎం నివాసంలోకి అక్రమంగా చొరబడ్డందుకు హఫీజుల్‌ మొల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ నిమిత్తం అతడ్ని జులై 11 వరకు కస్టడీకి తరలించారు.

కోల్‌కతాలోని సీఎం నివాసంలోకి ప్రవేశించిన ఈ వ్యక్తి పేరు హఫీజుల్‌ మొల్లా. వయసు 30 ఏళ్లకుపైగా ఉంటుంది. ఉత్తర 24 పరగణాలు జిల్లా హష్నాబాద్‌కు చెందిన ఇతడు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:20 గంటల సమయంలో కాళీఘాట్ ప్రాంతంలోని హరీష్‌ ఛటర్జీ వీధి 34బీలో గోడ దూకి మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించాడు. పటిష్ఠ భద్రత ఉన్నా.. ఎవరికంటా పడకుండా లోనికి వెళ్లాడు. 
చదవండి👉🏾మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్‌

హఫీజుల్‌ చెప్పేది నిజమేనా?
విచారణలో అతడు ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతున్నాడని పోలీసులు చెప్పారు. మొదట అతను పండ్లు అమ్మేవాడిని చెప్పాడని, ఆ తర్వాత డ్రైవర్‌నని మాట మార్చాడని పేర్కొన్నారు. అయితే అతడ్ని చూస్తే మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తిలా కన్పిస్తున్నాడని పేర్కొన్నారు. సీఎం నివాసంలోకి ప్రవేశించడానికి ముందు ఆదివారం అతడు ఎక్కడెక్కడ తిరిగాడో తెలుసుకుంటున్నామని, అతడు చెప్పిన వివరాల ప్రకారం మ్యాప్ రూపొందిస్తున్నామని వివరించారు. దీనిపై విచారణ చేపట్టి అతడు చెప్పింది నిజమో కాదో తేలుస్తామన్నారు.

భద్రతా భయాలు..
ఓ సాధారణ వ్యక్తి జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న సీఎం నివాసంలో ప్రవేశించడం భద్రతా భయాలను రేకెత్తించింది. ఉదయం 8 గంటల వరకు అతడ్ని ఎవరూ గుర్తించకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
చదవండి👉🏾బెంగళూరులో చెత్త సంక్షోభం

మరిన్ని వార్తలు