రూ.2 వేల నోటు ఇచ్చాడని.. స్కూటీ నుంచి పెట్రోల్‌ తిరిగి తీసుకున్నాడు!

23 May, 2023 16:54 IST|Sakshi

లక్నో: దేశ ప్రజలకి షాక్కిస్తూ రూ. 2 వేల నోటు రద్దు చేస్తున్నట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే సెప్టెంబ‌ర్ 30వ వ‌ర‌కు ఈ నోట్లు చ‌లామ‌ణిలో ఉంటుంద‌ని ఆర్బీఐ  స్ప‌ష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయలు నోట్ల మార్పిడికి తెగ ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో మార్చుకోవాలంటే క్యూలైన్‌, కేవైసీ అంటూ గంటల సమయం పడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు బంగారం కొనుగోలు, షాపులో వస్తువుల కొనుగోలు ద్వారా 2 వేల నోటు మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొంద‌రు వ్యాపారులు మాత్రం ప్రజల నుంచి రూ. 2 వేల నోటును స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకొందరైతే రెండు వేల రూపాయల నోటును తిరిగి ఇచ్చేసి తమ వస్తువులను మళ్లీ వెనక్కి కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జ‌లౌన్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఓ వాహ‌న‌దారుడు పెట్రోల్ బంక్‌కు వెళ్లి త‌న స్కూటీలో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం బంకులోని సిబ్బందికి తన వద్ద ఉన్న రూ. 2 వేల నోటు ఇచ్చాడు. ఆ సిబ్బంది రెండు వేల రూపాయల నోటు వద్దని వేరే నోటు ఇవ్వాలంటూ కోరాడు. వాహనదారుడు తన వద్ద ఈ నోటు మాత్రమే ఉందని చెప్పాడు. దీంతో ఆ సిబ్బంది స్కూటీలో నింపిన పెట్రోల్‌ను పైపు స‌హాయంతో బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది కేవలం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే కాదు పలు రాష్ట్రాల్లో కొందరు వ్యాపారులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే రూ. 2 వేల నోటును స్వీక‌రించ‌బోమ‌ని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
 

చదవండి: కామన్‌వెల్త్‌, కర్రీ, క్రికెట్‌.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ

మరిన్ని వార్తలు