-

గిరిజనుడికి అన్యాయం.. తప్పుడు రేప్‌ కేసులో జైలు శిక్ష.. సర్కార్‌పై పదివేల కోట్లకు దావా

4 Jan, 2023 10:18 IST|Sakshi

తప్పుడు అభియోగాలతో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడతను. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆ గిరిజనుడు ఊరుకోలేదు. న్యాయపోరాటానికి దిగాడు. ఏకంగా ప్రభుత్వాన్నే కోర్టుకు ఈడ్చాడు. ఫేక్‌ రేప్‌ కేసులో ఇరికించారని, జైలు శిక్ష అనుభవించేలా చేసి తన జీవితం నాశనం చేశారంటూ పరిహారం కోసం సర్కార్‌పై పదివేల కోట్ల రూపాయలకు దావావేశాడు. 

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై ఓ గిరిజనుడు కోర్టుకు ఎక్కాడు. కంతూ అలియాస్‌ కంతూలాల్‌ బీల్‌(35)ను గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితుడనే ఆరోపణలతో జైలుకు పంపారు పోలీసులు. ఓ వివాహితను మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేశాడనే అభియోగం నమోదు అయ్యింది అతనిపై. అక్టోబర్‌ 2018లో నమోదు అయిన కేసు అది. డిసెంబర్‌ 23, 2020 నుంచి రెండేళ్లపాటు శిక్ష అనుభవించాడతను.

సుమారు 666 రోజుల శిక్ష తర్వాత.. అతను అమాయకుడని తేలడంతో రిలీజ్‌ అయ్యాడు.అన్యాయంగా అత్యాచార అభియోగాలతో తనను రెండేళ్లపాటు జైల్లో ఉంచారంటూ ఆ సమయంలో వాపోయాడతను. అయితే.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొవడం, జైలు శిక్ష  తన జీవితాన్ని తలకిందులుగా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘దేవుడు ప్రసాదించిన జీవితంలో ఎన్నో విలువైన క్షణాలను దూరం చేసుకున్నా(ఉదాహరణకు శృంగార జీవితం)..’’ అంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడతను. పరిహారంగా రూ. 10,006 కోట్ల రూపాయలకు అతను దావా వేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు