ఆ పేర్లు మార్చేయాల్సిందే: బీజేపీ.. కుతుబ్‌ మినార్‌ను విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ డిమాండ్‌

10 May, 2022 16:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ కొత్త డిమాండ్‌తో ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చింది. హిందుత్వ అనుబంధ సంస్థలతో పోరాటానికి దిగింది. మొఘలాయిల పాలనకు.. బానిసత్వానికి గుర్తులుగా మిగిలిపోయి కొన్ని రోడ్ల పేర్లను వెంటనే మార్చాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ ఆదేశ్‌ గుప్తా.. ఎన్‌డీఎంసీ(న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌)కు ఓ లేఖ రాశారు. తుగ్లక్‌ రోడ్‌, అక్బర్‌ రోడ్‌, ఔరంగజేబ్‌ లేన్‌, హుమాయూన్‌ రోడ్‌, షాజహాన్‌ రోడ్‌.. వీటి పేర్లను తక్షణమే మార్చేయాలని డిమాండ్‌ చేశారాయన. అంతేకాదు.. వాటికి ఏయే పేర్లను పెట్టాలో కూడా సూచించాడు ఆ లేఖలో. 

తుగ్లక్‌రోడ్‌ను గురు గోవింద్‌ సింగ్‌ మార్గ్‌, అక్బర్‌ రోడ్‌ను మహారాణా ప్రతాప్‌ రోడ్‌, ఔరంగజేబ్‌ లేన్‌ను అబ్దుల్‌ కలాం లేన్‌, హుమాయూన్‌ లేన్‌ను మహర్షి వాల్మీకి రోడ్‌, షాజహాన్‌రోడ్‌ను జనరల్‌ బిపిన్‌ రావత్‌ గా మార్చేయాలంటూ డిమాండ్‌ చేశారు. పోయిన నెలలోనూ ఆయన 40 ఊర్ల పేర్లను మార్చాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సైతం ఒక డిమాండ్‌ చేశారు.

అలాగే బాబర్‌ లేన్‌ను స్వతంత్ర సమర యోధుడు ఖుదీరామ్‌ బోస్‌ గా మార్చాలని కోరారు. ఇదిలా ఉంటే.. 13 మంది సభ్యులతో కూడిన ఎన్‌డీఎంసీ ఈ లేఖను పరిశీలనకు తీసుకుంది. సాధారణంగా.. చరిత్ర, సెంటిమెంట్‌, సదరు వ్యక్తి గురించి సమాజానికి తెలియాల్సి ఉందన్న అవసరం మేరకు.. రోడ్లకు, ప్రదేశాలకు పేర్లు మార్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. యూపీ, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలు చేసి విమర్శలు ఎదుర్కొంది. ఆంగ్లేయులు, ఇస్లాం పాలకుల గుర్తులు ఇప్పుడేందుకంటూ ఆ టైంలో కొందరు బీజేపీ నేతలు పేర్ల మార్పు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు కూడా.

కుతుబ్‌ మినార్‌ను కూడా..
ఇదిలా ఉండగా.. రోడ్ల పేర్ల మార్పు తెర మీదకు రావడంతో మరికొన్ని డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ హిందూ సంఘం ఒకటి మంగళవారం ధర్నా చేపట్టింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మహాకల్‌ మానవ్‌ సేవా ప్రాంతంలో ఈ సంఘం నినాదాలు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా.. భారీగా పోలీసులు మోహరించారు. అంతేకాదు నిరసనల సమయంలో కొందరు హనుమాన్‌ చాలీసా పఠించినట్లు సమాచారం.

చదవండి: దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తాం

>
మరిన్ని వార్తలు