పార్లమెంటు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం హోమం

26 May, 2023 06:32 IST|Sakshi

 సర్వమత ప్రార్థనలు..

20 పార్టీల బహిష్కారం, పాల్గొంటున్నవి 25

న్యూఢిల్లీ: ముందుగా హోమం, తర్వాత సర్వమత ప్రార్థనలతో ఆదివారం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుకానుంది. ప్రధాన కార్యక్రమంలో 18 ఎన్డీఏ పక్షాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు దాదాపు 25 పక్షాలు పాలుపంచుకోనున్నాయి. బిజూ జనతాదళ్, జేడీ(ఎస్‌), అకాలీదళ్, బీఎస్పీ,  లోక్‌ జనశక్తి పార్టీ (రాంవిలాస్‌), టీడీపీ వీటిలో ఉన్నాయి. కాంగ్రెస్‌ సారథ్యంలో దాదాపు 21 పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించిన వేళ లోక్‌సభలో 50 మంది ఎంపీల బలమున్న ఈ ఏడు పార్టీల సంఘీభావం పాలక బీజేపీకి నైతిక స్థైర్యమిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తోంది.  

పాల్గొంటున్న బీఎస్పీ, టీడీపీ
పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రారంభించనుండటాన్ని స్వాగతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. విపక్షాల బహిష్కరణ నిర్ణయం సరికాదన్నారు. ఆదివాసీ గౌరవం గురించి మాట్లాడుతున్న విపక్షాలకు రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపదీ ముర్ముపై పోటీ పెట్టినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది. చరిత్రాత్మక సందర్భాన్ని రాజకీయం చేయకుండా హాజరై పెద్ద మనసు చూపాలని విపక్షాలకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రధాని కూడా పార్లమెంటులో భాగమేనని ఆ పార్టీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతి అంటే మనందరికీ గౌరవమే. ద్రౌపదీ ముర్ము గురించి కాంగ్రెస్‌ నేతలు ఎలా మాట్లాడారో గుర్తు చేసి ఆ పదవిని వివాదాల్లోకి లాగదలచుకోలేదు’’ అన్నారు.

కార్యక్రమం ఇలా...
► పార్లమెంటు నూతన భవన ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఏడింటికి హోమం జరుగుతుంది. తర్వాత సర్వమత ప్రార్థనలుంటాయి.
► అనంతరం హోమ వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తారు.
► అనంతరం లోక్‌సభ చాంబర్‌ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు.
► మధ్యాహ్నం ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు పాల్గొంటారు.
► మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్, కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష పార్టీల నేతలందరికీ
    ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. 

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు