హైదరాబాద్‌–విజయవాడ ఎన్‌హెచ్‌-65పై నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు..

16 Dec, 2022 01:14 IST|Sakshi

ఎన్‌హెచ్‌–65లో 6 లేన్లు అవసరం లేదు 

ప్రస్తుతం నందిగామ సెక్షన్‌లో నాలుగు లేన్లు సరిపోతాయి 

లోక్‌సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు 

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి నం.65లో నందిగామ సెక్షన్‌కు సంబంధించి ఇప్పటికే నాలుగు లేన్లు ఉన్నందున ప్రస్తుతానికి ఆరు లేన్ల అవసరం లేదని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం లోక్‌సభలో తెలిపారు. ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఈ సెక్షన్‌లోని 40 కి.మీ.నుంచి 221.5 కి.మీ. వరకు మొత్తం 181.5 కిలోమీటర్ల పొడవైన రహదారి నాలుగు లేన్లుగా ఉందని వివరించారు. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్‌కు నాలుగు లేన్లు సరిపోతాయని పేర్కొన్నారు. కాగా 15వ కిలోమీటర్‌ నుంచి 40వ కిలోమీటర్‌ వరకు ఆరు లేన్ల పనులు ఇప్పటికే ప్రారంభమ య్యాయని తెలిపారు. అంతేగాక ఎన్‌హెచ్‌–65లోని నందిగామ–ఇబ్రహీంపట్నం–విజయవాడ సెక్షన్‌ (పొడవు 49.2 కి.మీ.)ను 2004లోనే నాలుగు లేన్లుగా చేశామన్నారు. ఎన్‌హెచ్‌ 65లో 17 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించామన్నారు. అక్కడ పేవ్‌మెంట్‌ మార్కింగ్, సైన్‌ బోర్డులు, సోలార్‌ బ్లింకర్లు, రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు వంటి ప్రమాద నివారణ చర్యలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. అలాగే ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు కూడా తీసుకుంటామని గడ్కరీ లిఖితపూర్వకంగా తెలిపారు.  
 

మరిన్ని వార్తలు