Odisha: జలమే గరళం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య 

18 Jul, 2022 21:17 IST|Sakshi
టికిరి ఆస్పత్రిలో ఆరుబయటే చికిత్స పొందుతున్న అతిసార బాధితులు, నీటి నమూనాలను సేకరిస్తున్న వైద్య బృందం

రాయగడ(ఒడిశా): జిల్లాలోని కాసీపూర్‌లో అతిసార వ్యాధికి కారణం అక్కడి ప్రజలు కలుషితమైన నీటిని తాగడమేనని వైద్యులు ధ్రువీకరించారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు మృతి చెందడంతో పాటు వంద మందికి పైగా వ్యాధిబారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో టికిరి, కాసీపూర్‌లో పర్యటించిన వైద్య బృందం అక్కడ తాగునీటి కోసం వినియోగించే బావుల్లో నీటి నమూనాలను సేకరించారు. ఈ నీటి నమూనాలకు అన్ని పరీక్షలను నిర్వహించి, అతిసార వ్యాధికి కారణం ఆ నీరేనని నిర్ధారించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ లాల్‌మోహన్‌ రౌత్రాయ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం.
చదవండి: వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ

మరొకరు మృతి 
శనివారం నాటికి అతిసార వ్యాధితో ఆరుగురు మృతి చెందగా అదేరోజు అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన టికిరి పంచాయతీ పంచాలి గ్రామానికి చెందిన గొదాధర్‌ గొరడ (53) అనే వ్యక్తి ప్రాణాలను విడిచాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నా టికిరి, కాసీపూర్‌ ప్రాథమిక ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 60 మందికి పైగా రోగులు చికిత్స పొందుతుండగా, రాయగడ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 9 మందికి చికిత్స అందిస్తున్నారు.

ఎమ్మెల్యే పర్యటన
రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి టికిరి గ్రామంలోని జొడియా వీధిలో ఆదివారం పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. సమీపంలోని తాగునీటి బావిని పరిశీలించారు. కలుషితమైన నీటిని తాగడం వల్లే అతిసార వ్యాపించినట్లు పేర్కొన్నారు. తక్షణమే తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచాలని, దీంతో పాటు జొడియా వీధిలో సోలార్‌ విద్యుత్‌తో నడిచే మోటారు మరమ్మతులు చేయించాలని రూరల్‌ వాటర్, సప్లయ్‌ అండ్‌ శానిటేషన్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా మరో గొట్టపు బావిని ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం టికిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతి మజ్జి ఉన్నారు.

దుడుకాబహాల్‌లో డయేరియా
టికిరి, కాసీపూర్‌ ప్రాంతాలతో పాటు దుడుకాబహాల్‌లో డయేరియా విజృంభిస్తుండడంతో ఉషాపాడు ఆస్పత్రిలో గత వారం రోజుల్లో 122 మంది చేరారు. వీరిలో 48 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తూ, మిగతావారిని ఇళ్లకు పంపించినట్లు అధికారులు తెలియజేశారు. ఆస్పత్రిలో రోగుల పరిస్థితులను కలెక్టర్‌ సింగ్‌ స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.

బావుల మరమ్మతులు
కాసీపూర్, టికిరి ప్రాంతాల్లో అతిసార వ్యాపించడానికి కారణం కలుషితమైన నీటిని తాగడమేనని నిర్ధారణకు వచ్చిన జిల్లా యంత్రాంగం అయా ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్‌ స్వాధాదేవ్‌ సింగ్‌ స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు అదేశించారు. దీంతో ఆ శాఖకు చెందిన సిబ్బంది టికిరి, కాసీపూర్, దుడకాబహాల్‌ తదితర ప్రభావిత గ్రామాలకు చేరుకుని బావుల మరమ్మతుల పనుల్లో నిమగ్నమయ్యారు.   

మరిన్ని వార్తలు