ప్రేమ అంటూ పాక్‌ యువతి కంచె దాటింది.. బెంగళూరులో కాపురం పెట్టేలోపే..

20 Feb, 2023 18:05 IST|Sakshi

ఆమెది పాకిస్తాన్‌. అతనిది భారత్‌. అతనితో జీవితం పంచుకోవాలని ఉందంటూ.. దాయాది దేశం నుంచి కంచెదాటి భారత్‌లో అడుగుపెట్టింది. వివాహ బంధంతో ఒక్కటై కాపురం పెట్టేలోపే.. ఇక్కడి అధికారులు పసిగట్టి గట్టి షాకే ఇచ్చారు.  

పాకిస్తాన్‌కు చెందిన ఇక్రా జివాని(19).. ఆన్‌లైన్‌ లూడో ద్వారా యూపీకి చెందిన ములాయం సింగ్‌(26)కు దగ్గరైంది. ములాయం బెంగళూరులో స్థిరపడ్డాడు.  ఈ క్రమంలో ఆమెను భారత్‌కు రావాలని.. ఇక్కడే పెళ్లి చేసుకుని కాపురం పెడదామని ఇక్రాకు సూచించాడు ములాయం. అయితే.. ఆమెకు వీసా సమస్యలు ఎదురయ్యాయి. ఈలోపు ములాయం.. ఆమెను నేపాల్‌కు రమ్మని చెప్పాడు. 

కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె ఖాట్మాండు త్రిభువన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.  అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్న ములాయం.. తొలిసారి ఆమెను ప్రత్యక్షంగా చూసి మురిసిపోయాడు. ఆపై ఇద్దరూ ఖాట్మాండులోనే వివాహం చేసుకుని.. అక్కడే వారంపాటు ఉన్నారు. అటుపై సనోలీ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించించింది ఈ జంట. బెంగళూరుకు చేరుకుని.. ఇక్రా పేరును కాస్త ‘రవ’గా అనే హిందూ పేరుగా మార్చేశాడు ములాయం. 

ఇక.. కాపురం ప్రారంభమైన కొద్దిరోజులకే ఆమె తీరుపై చుట్టుపక్కల వాళ్లకు అనుమానాలు వచ్చాయి. హిందూ అమ్మాయి.. తరచూ నమాజ్‌ చేయడం ఏంటని షాక్‌ తిన్నారు చుట్టుపక్కల వాళ్లు. చివరకు పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు ములాయం ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె పేరిట ఉన్న పాకిస్థానీ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  

ఆపై ఇక్రాకు అరెస్ట్‌ చేసిన బెంగళూరు పోలీసులు.. ఆమె నుంచి ఏమైనా కీలక సమాచారం దొరుకుతుందేమోనని యత్నించారు. చివరకు ఆమె ములాయం కోసమే వచ్చిందని, గూఢాచారి కాదని నిర్ధారించుకున్నారు. ఆపై ఆమెకు మానసిక నిపుణులచేత కౌన్సెలింగ్‌ ఇప్పించారు. ఆపై ఆమెను అమృత్‌సర్‌కు తరలించారు. అక్కడ సైనికాధికారులు ఆదివారంనాడు అట్టారి సరిహద్దు ద్వారా ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపించేశారు.

మరిన్ని వార్తలు