ఉప్పుడు బియ్యం ఇవ్వకుండా తప్పుడు ప్రచారం

9 Dec, 2021 03:50 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా ఇస్తే అంత వేగంగా బియ్యాన్ని సేకరిస్తాం 

రికార్డు స్థాయిలో బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ సిద్ధం 

లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌ ప్రశ్నకు పీయూష్‌ గోయల్‌ జవాబు 

నాలుగైదు సార్లు గడువు పొడిగించినా అనుమతించిన మేరకు ఇవ్వలేదు 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం అనుమతించిన మేర బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం)ను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు అప్పగించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ధాన్యం సేకరణపై పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్‌సీఐ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధాన్యం సేకరణపై మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఇక్కడ డ్రామాలు చేసి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారన్నారు. ఎఫ్‌సీఐ ఆగస్టులో 40 లక్షల మెట్రిక టన్నుల బియ్యాన్ని తీసుకునేందుకు అంగీకరించినా, ఇప్పటివరకు సగం బియ్యాన్ని కూడా సేకరించలేదని, ఇందుకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. ‘తెలంగాణలో ఎఫ్‌సీఐ నేరుగా «ధాన్యం సేకరించదు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించి దాన్ని బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నాలుగైదు సార్లు గడువు పొడిగింపు ఇచ్చాం. తీవ్ర ఆవేదనతో చెబుతున్నా.

భారీగా బియ్యం తీసుకునేందుకు అనుమతించాక కూడా అంతమేర పారాబాయిల్డ్‌ రైస్‌ను ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు కూడా గడువు పొడిగించాం. తెలంగాణ ఎంత వేగంగా ఇస్తే అంత వేగంగా బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ధాన్యం కొనుగోలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం చేయదు..’అని స్పష్టం చేశారు. 

కేంద్ర జాప్యం లేదు 
తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి జాప్యం జరగడం లేదని ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం సేకరణ విషయమై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను సంప్రదించినప్పుడు అక్టోబర్‌ ఒకటి నుంచి జనవరి 31 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపిందని, దానికి అనుగుణంగా సేకరణ జరుగుతోందని చెప్పారు. గత నెల 30 నాటికి రాష్ట్ర సేకరణ సంస్థలు 16.14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాయని తెలిపారు.

రాష్ట్రానికి సంబంధించి 2016–17 ఏడాదిలో 53.67 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2017–18లో 54 లక్షలు, 2018–19లో 77.46 లక్షలు, 2019–20లో 1.11 కోట్లు, 2020–21లో 1.41 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తమ సేకరణ సంస్థల ద్వారా ధాన్యాన్ని సేకరించి, రాష్ట్ర అవసరాలకు మించి ఉన్న అధిక ధాన్యాన్ని మాత్రమే సెంట్రల్‌ పూల్‌ కింద ఎఫ్‌సీఐకి అందిస్తుందని వివరించారు.    

మరిన్ని వార్తలు