అనాథ పిల్లలకు ఉచిత విద్య 

30 May, 2021 01:37 IST|Sakshi

23 ఏళ్లు నిండేనాటికి రూ.10 లక్షలు వచ్చేలా డిపాజిట్‌ 

18 నుంచి 23 ఏళ్ల దాకా ప్రతినెలా స్టైపెండ్‌ 

పలు సంక్షేమ చర్యలు చేపట్టిన మోదీ సర్కార్‌ 

న్యూఢిల్లీ: కోవిడ్‌తో తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోవడంతో అనాథలైన చిన్నారుల సంక్షేమంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. అనాథలైన చిన్నారులకు ఉచిత విద్యతోపాటు 23ఏళ్లు నిండేనాటికి వారికి రూ.10లక్షలు అందేలా చూస్తామని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ‘చిన్నారులే భారత భవిష్యత్తు. వారికి పూర్తి తోడ్పాటునందించడంతోపాటు వారి సంరక్షణ, సంక్షేమ బాధ్యత మొత్తం మా ప్రభుత్వానిదే. కోవిడ్‌తో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులను, జీవించి ఉన్న ఏకైక పేరెంట్‌ను కోల్పోయిన చిన్నారులను, చట్టబద్ధంగా తమ ఆలనాపాలనా చూసే సంరక్షకుడు(గార్డియన్‌)/పెంపుడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ‘పీఎం–కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ పథకం కింద ఆదుకుంటాం. కోవిడ్‌లాంటి కష్టకాలంలో వారిలో మంచి భవిష్యత్‌పై నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వారిని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దుతాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో సర్కార్‌ రెండోసారి కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలు సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టింది. అనాథలైన చిన్నారులను ‘పీఎం–కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ పథకం కింద ఆదుకోవాలని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటన విడుదలచేసింది. ఈ సంక్షేమ చర్యలను చిన్నారులకు పూర్తి సమర్థవంతంగా అమలుచేయాలంటే పీఎం–కేర్స్‌ ఫండ్‌కు విరాళాలను మరింతగా అందివ్వాలని భారత పౌరులను మోదీ కోరారు. ఏప్రిల్‌1 నుంచి మే 25 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్‌ కారణంగా 577 మంది చిన్నారులు అనాథలయ్యారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల చెప్పారు.

చిన్నారుల పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ 
►అనాథలైన చిన్నారుల పేరు మీద ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తెరుస్తారు. 
►అనాథ అయిన ఆ అమ్మాయి/అబ్బాయికి 23 ఏళ్లు వచ్చేనాటికి డిపాజిట్‌ మొత్తం రూ.10 లక్షలకు చేరేలా పీఎం–కేర్‌ ఫండ్‌ నుంచి నిధులను బ్యాంకుల్లో జమచేస్తారు.  
►వారికి 18 ఏళ్లు పూర్తయి 23 ఏళ్లు వచ్చే దాకా.. ఐదేళ్లపాటు ప్రతీ నెలా వారికి సొంత అవసరాల కోసం స్టైపెండ్‌ ఇస్తారు. 
►కార్పస్‌ ఫండ్‌ నుంచి వచ్చే వడ్డీని వారికి 23 ఏళ్లు వచ్చే వరకు వ్యక్తిగత/ వృత్తిపరమైన అవసరాల కోసం అందివ్వనున్నారు. 
►23 ఏళ్లు నిండాక మొత్తంగా ఒకేసారి డిపాజిట్‌ మొత్తాన్ని అందిస్తారు. 

చిన్నారుల విద్య కోసం.. 
►10 ఏళ్లలోపు వయసు చిన్నారులకు దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయ/ ప్రైవేట్‌ పాఠశాలలో డే స్కాలర్‌గా అడ్మిట్‌ చేస్తారు. 
►11–18 ఏళ్ల వయసు పిల్లలను సైనిక్‌ స్కూల్‌/ నవోదయ విద్యాలయ ఇలా ఏదైనా కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చేర్పిస్తారు. 
►గార్డియన్‌/సమీప బంధువుల దగ్గర ఉండదలచుకున్న చిన్నారులను దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయ/ప్రైవేట్‌ స్కూల్‌లో చేరుస్తారు. 
►ప్రైవేట్‌ స్కూల్‌లో చేరితే విద్యాహక్కు చట్ట ప్రకారం నిర్ణయించిన ఫీజులను పీఎం–కేర్స్‌ ఫండ్‌ నుంచి చెల్లిస్తారు. యూనిఫాం, టెక్ట్స్‌/నోట్‌ పుస్తకాల ఖర్చులూ ఇస్తారు. 

ఉన్నత విద్య కోసం.. 
►ఉన్నత విద్య అవసరాల కోసం స్టైపెండ్‌ అందివ్వనున్నారు. 
►వృత్తి విద్య, ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలనుకునే వారు విద్యా రుణం పొందేలా కేంద్రం సాయపడనుంది. ఈ రుణంపై చెల్లించాల్సిన వడ్డీని పీఎం–కేర్స్‌ ఫండ్‌ చెల్లించనుంది. 
►రుణాలు తీసుకోని వారికి.. అండర్‌గ్రాడ్యుయేట్‌/ఒకేషనల్‌ కోర్సుల్లో చేరితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద వారి ట్యూషన్‌/కోర్సు ఫీజుకు సరిసమానమైన స్కాలర్‌షిప్‌నూ అందిస్తారు. 
►ప్రస్తుత స్కాలర్‌షిప్‌ పథకాలకు అనర్హులైన చిన్నారులకూ స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నారు. 

ఆరోగ్య బీమా 
►చిన్నారులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ లేదా ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకాన్ని వర్తింపచేస్తారు. 
►దీంతో వీరందరికీ రూ.5లక్షల ఆరోగ్య బీమా లభించనుంది. 
►ఈ చిన్నారులకు 18ఏళ్లు నిండేవరకూ ఈ పథకాలకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను పీఎం– కేర్స్‌ ఫండ్‌ నుంచి అందిస్తారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు