అసాధారణం.. మన అద్భుత విజయం: ఆసియా క్రీడల్లో భారత్‌ సెంచరీపై ప్రధాని మోదీ హర్షం

7 Oct, 2023 10:53 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇవాళ వంద పతకాల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు సృష్టించిన వేళ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారుల్ని ఉద్దేశించి ట్వీట్‌ చేశారాయన. అంతేకాదు వాళ్లను కలుసుకుని ముచ్చటించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

ఆసియా క్రీడల్లో భారత్‌కు దక్కిన అద్భుత విజయం!. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అబ్బుర పరిచే వాళ్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించి.. మన హృదయాలను గర్వంతో నింపింది. 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి,  అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారాయన. 

మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వంద పతకాలు వచ్చాయి. అందులో స్వర్ణం 25 ఉండగా.. ఇవాళ ఒకే రోజు 3 దక్కాయి. ఇక.. మిగిలిన పతకాల్లో రజతం 35, కాంస్యం 40 ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది భారత్‌. రేపటితో ఆసియా గేమ్స్‌ 2023 ముగియనున్నాయి.

మరిన్ని వార్తలు